
డబుల్ డక్కర్ అనగానే ఒకప్పుడు హైదరాబాద్ సిటీ బస్సులు గుర్తుకు వస్తాయి. ఇది 1990లో రోడ్లపై తిరుగుతూ ఉండేవి. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా వాటిని నిలిపివేసింది ప్రభుత్వం. ఈ తరహా బస్సులు చెన్నైలో కూడా కనిపిస్తూ ఉండేవి. అయితే అలాంటి రోజులు మళ్లీ తిరిగి వచ్చేశాయి. అది కూడా మన హైదరాబాద్ నగరంలోనే రావడం పర్యాటక ప్రేమికులకు మరింత ఆనందాన్ని కల్గిస్తోంది.
గత ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఫార్ములా- ఈ పోటీల సందర్భంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వీటిని కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు ధర రూ. 2.5 కోట్లు కాగా మూడు బస్సులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ బస్సులు నగర ప్రధాన రహదారులపై తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సందర్భంగా హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతూ సందర్శకులకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ బస్సులో ఎక్కి ఉచితంగా ప్రయాణం చేయవచ్చంటున్నారు అధికారులు. ఈ బస్సులు ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ బస్సులు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టూ ఉండే పర్యాటక ప్రదేశాల్లో మాత్రమే తిరుగుతోంది. అమరవీరుల స్మారకం (జ్యోతి), సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, పీవీ నరసింహ రావు మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా, నక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్, లేక్ ఫ్రంట్ వ్యూ పార్క్, థ్రిల్ సిటీ, సంజీవయ్య పార్క్ వరకూ ప్రయాణిస్తుంది. దీంతో అటుగా వెళ్ళే సందర్శకుల రద్దీ అమాంతం పెరిగింది. హైదరాబాదీలతో పాటూ వివిధ రాష్ట్రాల, దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా ఇందులో కూర్చొని ప్రయాణిస్తున్నారు. చిన్న పిల్లలకు కొత్త అనుభూతిని అందిస్తోంది.
ఈ బస్సు ప్రతి రోజూ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు ఎహ్ఎండీఏ అధికారులు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ డబుల్ డక్కర్ బస్సులను చాలా ట్రిప్పులు నడుపుతున్నారు. వారాంతాల్లో, సెలవు రోజుల్లో దీనికి అధిక స్పందన లభిస్తోందంటున్నారు నిర్వాహకులు. ఈ బస్సులను ఎక్కి చిన్నా, పెద్దా అందరూ సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తూ నగరంలోని పర్యావరణ ప్రదేశాలను చూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..