హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో కన్న కొడుకును కడతేర్చాడు ఓ తండ్రి. ఏడుస్తున్నాడనే కోపంతో రెండేళ్ల బాలుడిని అతికిరాతకంగా కొట్టి హతమార్చాడు. హైదరాబాద్ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని నేరేడ్మెట్ జే జే నగర్ లోని ఎస్.ఎస్.బి క్లాసిస్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు దివ్య, సుధాకర్ దంపతులు. అక్కడే నివాసముంటున్నారు. 2019లో ప్రేమ వివాహం చేసుకున్న వీరికి జీవన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా మద్యం అలవాటున్న సుధాకర్ సోమవారం రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికొచ్చాడు. అక్కడ రెండేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. సుధాకర్ తన కొడుకు బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఏం కష్టమొచ్చిందో కానీ ఆ పిల్లాడు ఏడుపు ఆపలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన సుధాకర్ కోపంతో దారుణంగా బాలుడిని కొట్టాడు. దీంతో జీవన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా భర్త చేతిలో తన కుమారుడు చనిపోయాడని తెలసి తల్లి విలవిల్లాడిపోయింది. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. ఇది స్థానికులను కూడా కలచివేసింది. కాగా ఈఘోరంపై తల్లి దివ్య నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధాకర్ ను అదుపులో తీసుకున్నారు. విచారణ ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..