AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మీరు లక్ష ఇస్తే.. వారు వెంటనే 4 లక్షలు ఇస్తారు.. ఇదేం యవ్వారం అంటే..

తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనుకున్నారు. నకిలీ నోట్ల చలామణితో రెచ్చిపోవాలనుకున్నారు. కానీ.. హైదరాబాద్‌ పోలీసుల ఎంట్రీతో ఫేక్‌ కరెన్సీ గ్యాంగ్‌ గుట్టురట్టయింది. ఇంతకీ.. ఈ నకిలీ నోట్ల ముఠాలో సూత్రధారులు ఎవరు?.. పాత్రధారాలు ఎవరు?... అసలు ఈ గ్యాంగ్‌కు ఎలా చెక్ పెట్టారు..?

Hyderabad: మీరు లక్ష ఇస్తే.. వారు వెంటనే 4 లక్షలు ఇస్తారు.. ఇదేం యవ్వారం అంటే..
Currency Notes
Ram Naramaneni
|

Updated on: Mar 14, 2025 | 7:44 AM

Share

నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న కేసులో ఏడుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఫేక్ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్నట్లు ఎల్బీనగర్‌ పోలీసులకు సమాచారం అందడంతో వల పన్ని పట్టుకున్నారు. నిందితుల నుండి 11 లక్షల 50వేల ఫేక్ కరెన్సీ నోట్లు, నాలుగు లక్షల రూపాయల ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన మాణిక్యరెడ్డితో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.

అహ్మదాబాద్‌కి చెందిన సురేష్ నుంచి నకిలీ కరెన్సీ నోట్లను హైదరాబాద్‌ తీసుకొచ్చి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక లక్ష ఒరిజినల్ నోట్లకు.. 4 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తూ మోసాలు చేస్తున్నట్లు తేల్చారు. మొత్తం ఏడుగుర్ని అరెస్ట్‌ చేసి.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. ఇక.. ప్రధాన నిందితుడు కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన చిన్నమాణిక్యరెడ్డి.. పెద్ద అంబర్‌పేట్‌లోని శబరి హిల్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఫైనాన్స్‌ వ్యాపారస్తుడైన మాణిక్యరెడ్డి.. బిజినెస్‌ దెబ్బ తినడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆ అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అందులోనూ.. ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. నకిలీ కరెన్సీ వ్యాపారం చేసే గుజరాత్‌కు చెందిన సురేష్‌ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని.. ఫేక్‌ కరెన్సీ వివరాలు తెలుసుకున్నాడు. సురేష్‌కు ఒరిజినల్‌ కరెన్సీ లక్ష ఇచ్చుకుని.. సుమారు 12 లక్షల విలువైన నకిలీ కరెన్సీని తీసుకున్నాడు. ఆపై.. వాటి చెలామణి కోసం వివిధ జిల్లాలకు చెందిన పలువురు అమాయకులను ఎంచుకుని రెచ్చిపోయాడు.

అయితే.. దీనికి సంబంధించి ఎల్బీనగర్‌ పోలీసులకు సమాచారం అందడంతో చింతలకుంటలో ఏడుగురు సభ్యుల గ్యాంగ్‌ అరెస్ట్‌ చేశారు. నకిలీ కరెన్సీని సరఫరా చేసిన అహ్మదాబాద్‌కు చెందిన సురేష్‌ పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.