పైసా.. కోసం అడ్డదారులు తొక్కేవారు అడుగడుగునా పుట్టుకొస్తున్నారు. ఏకంగా కరెన్సీనే.. నకిలీవి పుట్టించి దందాకు తెగబడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోనూ ఇలాంటి ఘరానా మోసమే వెలుగులోకి వచ్చింది. ఈజీ మనీ కోసం.. నీచ్ కమీనే పనులు చేస్తూ అడ్డంగా బుక్ అవుతుంటారు కేటుగాళ్లు. యూట్యూబ్ వీడియోలు చూసి.. నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. నిజమైన కరెన్సీకి ఏమాత్రం తీసుపోని విధంగా నకిలీ కరెన్సీని తయారుచేస్తున్న ముఠాను చాంద్రాయణగుట్టలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 27 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను సీజ్ చేశారు. నకిలీ కరెన్సీతో పాటు కరెన్సీ తయారు చేయడానికి వాడే మెటీరియల్ కూడా ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. నారాయణ పేట జిల్లా కొస్గికి చెందిన కస్తూరి రమేష్ బాబు.. ఈ ముఠాలో కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
రమేష్ బాబు.. ఓ సాదా సీదా కారు మెకానిక్. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సులభంగా డబ్బు సంపాదించడం ఎలా ఆలోచలనలో అతనికి తట్టిన తప్పుడు ఆలోచనే నకిలీ కరెన్సీ తయారీ. నకిలీ కరెన్సీ ఎలా తయారు చేయాలా అనేదానిపై యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూశాడు. వెంటనే ఓ ల్యాప్‌టాప్, లామినేటర్, ప్రింటర్, కలర్ బాక్స్‌లతో పాటు మరికొన్ని యంత్రాలను కొనుగోలు చేశాడు. ఫేక్ కరెన్సీ చేయడం మొదలుపెట్టాడు. యదేచ్ఛగా చలామణీ చేస్తూ అక్రమ దందాకు తెరలేపాడు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రమేష్ బాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
అంతటితో బుద్ధి తెచ్చుకుని ఆ నకిలీ దందా మానేస్తారని పోలీసులు భావించారు. కానీ సరికొత్త యవ్వారం జైలు నుంచే మొదలైంది. రమేష్ బాబు జైలులో ఉండగా, బహదూర్‌పురాలో హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హసన్ బిన్ హమూద్ పరిచయం అయ్యాడు. వీళ్లిద్దరూ కలిసి నకిలీ కరెన్సీ చెలామణికి పక్కా స్కెచ్ వేశారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత రమేష్‌బాబు, అతని కుటుంబం తాండూరుకు మకాం మార్చింది. తన సోదరి రామేశ్వరితో కలిసి నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి ముడిసరుకును సేకరించాడు. అన్నీ సమకూరాక 500 నోట్ల కరెన్సీ ముద్రించడం ప్రారంభించాడు. ముద్రించిన నోట్లను నేరుగా గుజరాత్ పంపించేస్తున్నాడు. దీన్ని పసిగట్టిన గుజరాత్ పోలీసులు.. 2023 జనవరిలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
రమేష్ బాబు లాకప్‌లో ఇరుక్కోవడంతో.. హసన్ బిన్‌ను రామేశ్వరి సంప్రదించింది. ఆ తర్వాత నకిలీ కరెన్సీ ముద్రణ మెటీరియల్‌ను చాంద్రాయణ గుట్టకు తరలించారు. అక్కడ మళ్లీ ఫేక్ కరెన్సీ తయారుచేయడం మొదలుపెట్టారు. ఈ సారి కూడా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇప్పటి వరకూ ఎంత మొత్తంలో నకిలీ కరెన్సీని చలామణీ చేశారనేది ఎంక్వైరీ చేస్తున్నారు.
మామూలుగా అయితే ఈ నోటును గుర్తించడం చాలా కష్టం. మెషీన్లతో లెక్క పెట్టినప్పుడు మాత్రమే వీటిని గుర్తించే అవకాశం ఉంటుంది. కూరగాయల మార్కెట్లు, చిన్న చిన్న చిల్లర కొట్లలో ఇలాంటి దొంగనోట్లు ఇస్తే.. వాటిని దాదాపుగా గుర్తుపట్టడం కష్టం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు,
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..