దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్యాస్, పెట్రోలు, వంటనూనె, కూరగాయలు ఇలా నిత్యావసర సరకులన్నీ ధరలు విపరీతంగా పెరిగిపోతూ అందకుండా ఆకాశానికి ఎగురుతున్నాయి. దీంతో కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కూరగాయల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్న సమయంలో ఆకు కూరలు కూడా అందకుండా పోతున్నాయి. కూరల్లో కొత్తిమీర వేయడం కామన్. ఇక నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అది లేకుంటే పూర్తి కానే కాదు. వంటలకు అదనపు రుచి, సువాసన ఇచ్చే కొత్తిమీర సామాన్యులకు అందనంటోంది. తాజాగా కొత్తమీర ధర విపరీతంగా పెరిగిపోయింది. ఐదు రూపాయలకు రెండుమూడు కట్టలు లభించే కొత్తిమీర ఇప్పుడు కిలో ఏకంగా 400 రూపాయలకు చేరుకుంది. నిన్నమొన్నటి వరకు కిలో కొత్తమీర 80 నుంచి 100 రూపాయలు పలకగా నేడు వరంగల్, ఖమ్మం మార్కెట్‌లలో రూ.400 పైనే పలుకుతోంది.
కర్ణాటక నుంచి కొత్తిమీర ఈ మార్కెట్లకు సరఫరా అవుతోంది. కర్ణాటకలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. దీంతో అక్కడి నుంచి ప్రస్తుతం అరకొరగా సరఫరా అవుతోంది. కొద్దిమొత్తంలో వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు పోటీపడుతుండడంతో దాని ధర అమాంతం కొండెక్కింది. సెప్టెంబర్ 17న పలు మార్కెట్లలో కిలో కొత్తిమీర 400 రూపాయల వరకు పలికింది. మహబూబాబాద్ జిల్లాలో రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని, ధరల పెరుగుదలకు ఇదే కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..