Traffic Rules: రోడ్డుపై వాహనాన్ని నడపాలంటే కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో తెలిసో, తెలియక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటాం. దీంతో పోలీసులు జరిమానా విధించడం కూడా సర్వ సాధారణమైన విషయం. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసులు చలాన్లను చెల్లించని వారి వాహనాలను సీజ్ చేస్తుంటారు. మరి వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసుకు నిజంగానే ఉందా.? అసలు చట్టం ఏం చెబుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ లాయర్ హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. నిఖిలేష్ అనే న్యాయవాది కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో నిఖిలేష్ ఆగస్టు 1న బైకుపై వెళుతుండగా పర్వత్ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. బైక్‌పై రూ. 1635 చలానా పెండింగ్ ఉందని వెంటనే చెల్లించాలని ఎస్సై మహేంద్రనాథ్ తెలిపారు. అయితే నిఖిలేష్ దీనికి నిరాకరించడంతో పోలీసులు ఆయన వాహనాన్ని సీజ్ చేశారు. ఒక్క చలాన్ ఉంటేనే బైక్‌ను సీజ్ చేస్తారా? అని ప్రశ్నించగా తాము చట్టం ప్రకరమే చేశామని పోలీసులు సమాధానం ఇచ్చారు. దీంతో నిఖిలేష్ అసలు తన బైక్‌పై ఏ సమయంలో చలానా పడిందో చెప్పాలని పోలీసులను కోరాడు. చెక్ చేసిన పోలీసులు.. ప్రవేశం లేని ఫ్లైఓవర్‌పై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా రూ.1635 జరిమానా చెల్లించారని తెలిపారు.
దీంతో ఒక్క ఉల్లంఘనకు మూడు జరిమానాలు ఎలా విధిస్తారంటూ నిఖిలేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే హక్కు పోలీసులకు లేదని ఆగస్టు 11న తీర్పును వెలువరించింది. వాహనాన్ని వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో పోలీసులు నిఖిలేష్‌కు బైక్‌ను తిరిగిచ్చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
Uttarakhand: నైనిటాల్ జిల్లాలో విరిగిపడిన కొండ చరియలు.. తృటిలో బస్సుకు తప్పిన ప్రమాదం