
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్‌లను ప్లస్ చేస్తోంది అధిష్టానం. తెలంగాణ కేబినెట్‌లో ముస్లింలు లేరన్న విపక్షాల విమర్శలకు కేబినెట్ విస్తరణతో సమాధానం చెప్పబోతోంది. ఈనెల 31న తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని.. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.. ఆయన ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలలలోగా మంత్రి పదవి ఇవ్వనుంది కాంగ్రెస్ అధిష్టానం.. అయితే.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇందుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికనే ప్రధాన కారణంగా చెబుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తుంది. కానీ, ఈ రెండేళ్లలో మైనార్టీల మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటూ పేర్కొంటోంది.. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కావాలనే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముస్లిం నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి అప్పగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తో పాటు లీగల్ సెల్ కలిసి ఫిర్యాదు చేసింది.
‘‘అజారుద్దీన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీలో దిగి.. ఓడిపోయారు. అయితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం ఓట్లను మభ్యపెట్టే విధంగా ఈ మంత్రివర్గ విస్తరణ ఉంది. హైదరాబాద్ పరిధిలో ఎన్సిసి కోడ్ కేవలం జూబ్లీహిల్స్ పరిమితమైనప్పటికీ.. ఇది జూబ్లీహిల్స్‌లోని ఓటర్లను సైతం ప్రభావితం చేస్తున్నందున ఎన్సిసి కోడ్ ఉల్లంఘన కింద పరిగణలోకి తీసుకోవాలి’’ అని.. ఎలక్షన్ కమిషన్ కు బిజెపి నేతలు విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఒక వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ కి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై బిజెపి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.
ఇలాంటి ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి… pic.twitter.com/X5m3pANdjX
— BJP Telangana (@BJP4Telangana) October 30, 2025
నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేసే ఏ నిర్ణయమైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని.. మంత్రివర్గ విస్తరణ సైతం ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈసీని కోరారు. ఎన్నికల అధికారులు న్యాయ నిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తుంది. కెబినెట్ విసరణ వేళ.. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..