అచేతన స్థితిలో పడి ఉన్న మహిళకు ప్రాణం పోయడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని కానిస్టేబుల్ నవీన అన్నారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ-20 సిరీస్ లో భాగంగా.. మూడో మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మ్యాచ్ జరుగుతండంటంతో అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ ఘటనలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే కానిస్టేబుల్ నవీన 2 నుంచి 5 నిమిషాల వరకు సీపీఆర్ చేయడంతో రజిత తిరిగి శ్వాసతీసుకోవడం, అచేతనంగా ఉన్న మహిళలో కదలిక ప్రారంభమైంది. దీంతో ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన నవీనను పలువురు ప్రశంసించారు.
మాది కరీంనగర్ జిల్లాలోని బాపుపేట. మానాన్న శివప్రసాద్, అమ్మ అనిత. నేను పోలీస్ అవ్వాలని నాన్న కల. చిన్నపుడే పద్మారావునగర్ కు వచ్చి స్థిరపడ్డాం. డిగ్రీ పూర్తయిన తర్వాత కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాను. మా నాన్న కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా పోలీసు శిక్షణలో నేర్పిన సీపీఆర్ పద్ధతితో ఓ మహిళకు సరైన సమయంలో చికిత్సను అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాను. ఈ అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. జీవితంలో మరిచిపోలేను.
– దువ్వ నవీన, మహిళా కానిస్టేబుల్
తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళను ప్రాణప్రాయ స్థితి నుంచి కాపాడిన నవీనను ఉన్నతాధికారుల నుంచి నెటిజన్లు వరకు అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి డాక్టర్లే కాకుండా పోలీసులూ ప్రాణాలు పోస్తారని నిరూపించారని కొనియాడారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఓ మహిళను కాపాడిన నవీనను కమిషనర్ సీవీ ఆనంద్ సన్మానించారు. అంతే కాకుండా రూ.5 వేలు నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందించారు. కానిస్టేబుల్ వివరాలను పంపాలని గవర్నర్ తమిళి సై బేగంపేట పోలీసులకు సమాచారం పంపడం విశేషం.
హైదరాబాద్ లో జరగనున్న భారత్- ఆస్టేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయంపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద గురువారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు మరో 20 మంది క్రికెట్ అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దాదాపు మూడు సంవత్సరాల తరువాత హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టీ 20 కి అతిధ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 25న జరిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం ప్రేక్షకులు విపరీతంగా వచ్చారు. టికెట్లు ఏమయ్యాయంటూ అభిమానులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..