Jana Reddy Sensational Comments : కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. అధికారం కోల్పోయి ఆరేళ్లు గడుస్తున్నా పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతోంది. ముఖ్యంగా తమ మాట పట్టించుకోవడంలేదని సొంతపార్టీ నేతలపై సీనియర్లే ఫైర్ అవుతున్నారు. తాజాగా పార్టీ నేతలపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరికి వారు బాధపడుతున్నారని తెలిపారు జానారెడ్డి. అభిమానం ఉంటే ఇతర నాయకుల్ని విమర్శిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. అలాంటి కార్యకర్తలు, నాయకుల వల్ల పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు.
గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి పార్టీ నేతల మధ్య ఏమైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు. ఒక నాయకుడిని గౌరవిస్తూ మరో నాయకుడిని అవమానపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆయన ఘాటుగానే స్పందించారు. పార్టీలోని నేతలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువై పోతున్నాయని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధిష్టానానికి సూచించారు. గ్రూపు రాజకీయాలతో కొందరు నేతలు పార్టీని బలహీన పరుస్తున్నారని జానా మండిపడ్డారు. పార్టీని బలహీనపరిచే వారిపై పీసీసీ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పీసీసీ స్పందించకపోతే.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు. పార్టీలో సీనియర్ల నుంచి చిన్న నాయకుల వరకు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలో ఎవరికి వారు బాధపడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే రేవంత్ రెడ్డి అభిమానులకే జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఎవరు అవమానం చేసినా.. అపహస్యం చేసిన ఆ నష్టం పార్టీకే అని జానా తెలిపారు. ఏ నాయకుడ్ని అయినా అభిమానిస్తే… కార్యకర్తలు క్రమశిక్షణతో ఆయనకు తమ మద్దతు ఇవ్వాలన్నారు. సొంత పార్టీకి చెందిన ఇతర నాయకుల్ని విమర్శించకూడదని సూచించారు. అలాంటి చర్యలు వల్ల ఘర్షణ వాతావరణం, మనస్పర్థలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి చర్యలు పార్టీకి, నాయకత్వానికి సరైనవి కాదని జానారెడ్డి హెచ్చరించారు. కార్యకర్తలు అభిమానించే నాయకుడు కూడా తన వెంట ఉన్నవారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేయకుంటే ఆ నాయకుడికి, ఆయన వెంటున్న వారికి కూడా నష్టం తప్పదన్నారు జానారెడ్డి హెచ్చరించారు.
మరోసారి కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలున్నాయని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీపీసీసీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, రేవంత్ అభిమానులకే జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని సొంత పార్టీ నేతలతో పాటు.. ఇతర పార్టీల నేతలు సైతం చర్చించుకుంటున్నారు.
Read Also… Fisheries Ministry: ‘మత్స్య మంత్రిత్వ శాఖ” కామెంట్.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.!