బిర్యానీ అంటే ఎవ్వరికైనా ఇష్టమే.. ఇక హైదరాబాద్ బిర్యానీ.. అంటే నాన్ వెజ్ ప్రియులెవరైనా లొట్టలేసుకుంటూ తింటారు.. హోటళ్లు, రెస్టారెంట్లు అందుబాటులో లేకపోతే ఆర్డర్ ఇచ్చి మరి తెప్పించుకుంటారు.. అయితే, బిర్యానీ తిందామని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి బిర్యానీ తీసుకెళ్లిన వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. బిర్యానీ నుంచి బొద్దింక బయటకు రావడం చూసి.. వెంటనే రెస్టారెంట్ మేనేజర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అయితే, అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. దీంతో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ విచారణ చేపట్టి.. కస్టమర్‌కు రూ.20వేలు చెల్లించాలని రెస్టారెంట్ ను ఆదేశించింది. ఈ ఘటన 2021 సెప్టెంబరు లో జరిగింది.
అరుణ్ అనే వ్యక్తి అమీర్‌పేటలోని కెప్టెన్ కుక్ రెస్టారెంట్ నుంచి బిర్యానీ తీసుకొని ఇంటికెళ్లాడు. అయితే, బిర్యానీలోంచి బొద్దింక బయటకు రావడం చూసి షాకయ్యాడు. వెంటనే వీడియో తీసి.. రెస్టారెంట్ మేనేజర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. స్పందించిన రెస్టారెంట్ మేనేజర్ క్షమాపణ చెప్పాడు. ఆ స్థలంలో తెగులు నియంత్రణ జరుగుతోందని, ఈ క్రమంలో బొద్దింక పడి ఉండవచ్చని పేర్కొన్నాడు.
ఇది చూసి చాలా బాధపడ్డానని, తన ఆకలిని చంపేశారన్న కారణంతో క్షమాపణలను అంగీకరించడానికి అరుణ్ నిరాకరించాడు. దీంతో రెస్టారెంట్ మేనేజర్ రూ.240 మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. ఆ తర్వాత అరుణ్ ఈ విషయాన్ని జిల్లా ఫోరమ్‌కు తీసుకెళ్లాడు. అయితే, అక్కడ అరుణ్ ఆరోపణలను రెస్టారెంట్ ఖండించింది. టేక్‌అవే బాక్స్‌లోని భోజనం తాజాగా, వేడిగా ఉందని, ఆ ఉష్ణోగ్రత వద్ద ఒక క్రిమి సజీవంగా ఉండే అవకాశం లేదని రెస్టారెంట్ తెలిపింది.
వివరాలను విన్న తర్వాత, కమిషన్ రెస్టారెంట్ యజమానులను దోషులుగా గుర్తించింది. వారు పరిశుభ్రత, నాణ్యాతా ప్రమాణాలను నిర్వహించడంలో విఫలమయ్యారని పేరొంది. బొద్దింక నిజంగానే బయటకు పాకినట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతోందని కమిషన్ పేర్కొంది. పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంలో OP నిర్లక్ష్యంగా వ్యవహరించింది.. చెల్లించిన ఛార్జీల మేరకు నాణ్యమైన ఉత్పత్తి లేదా సేవను కలిగి ఉండటం ప్రతి వినియోగదారుని ప్రాథమిక హక్కు అని కమిషన్ పేర్కొంది. రెస్టారెంట్ వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంలో ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు పాటించడంలో విఫలమైందని పేర్కొంది.
కెప్టెన్ కుక్ రెస్టారెంట్ మేనేజర్‌పై ఎం అరుణ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్ 18న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.20వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 45 రోజుల వ్యవధిలో జరిమానా చెల్లించాలని కమీషన్ ఆదేశించడంతోపాటు.. అదనంగా మరో రూ.10,000 కూడా చెల్లించాలని సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..