కాంగ్రెస్ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది.. సెక్రటేరియట్ ముందు దివంగత మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించింది. అనేక వివాదాలు, విపక్షపార్టీ ఆక్షేపణల నడుమ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ భారీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందరర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తామన్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామన్నారు. సొంత విగ్రహం పెట్టుకుందామనే ఇక్కడ స్థలం ఖాళీగా ఉంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం BRS నేతలు చేసిన త్యాగాలు ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్ కుటుంబం ఒక్కరు కూడా హాజరు కాలేదన్నారు. కొంతమంది మిడతల దండును ప్రజల మీదకు ఉసి గొల్పుతున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తరిమికొట్టాలంటూ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని వారికి మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే కేటీఆర్ అమెరికా వెళ్లి జాబ్ చేశారని.. ఐటి మంత్రి అయ్యారంటూ పేర్కొన్నారు. త్యాగాలు అంటే నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ కుటుంబానిదేనన్నారు.
తెలంగాణ ఇచ్చింది మేము.. తెలంగాణ తెచ్చింది మేము.. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది మేము.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని.. అయితే.. కొందరు వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్నారని.. BRS నేతలు చేసిన త్యాగాలు ఏంటో చెప్పాలన్నారు.
ఇదిలాఉంటే.. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ ఫైర్ అయింది.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని ప్రశ్నించారు మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామన్నారు. రాజీవ్ విగ్రహం తొలగింపుపై ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి