
అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరోసారి ఇదే అంశంపై కీలక సమీక్ష నిర్వహించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆదర్శంగా ఉండే విధంగా పని చేయాలని తెలిపారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన సీఎం రేవంత్.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
డ్రగ్స్‌కు సంబంధించిన కేసులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టాలని.. ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్‌ను బ్రేక్ చేయాలని, ఎవరైనా వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం సమర్థవంతంగా పని చేసేవారిని ప్రోత్సహించాలని సూచించారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డ్రగ్స్ అనే పదం వింటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు.
ఇక హైదరాబాద్‌లో పరిస్థితులపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్. 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. జూన్4లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తే సహించేది లేదని.. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..