
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షాలు పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం తెలిపారు. ధాన్యం రోడ్లపై ఆరబోస్తే తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు అన్నారు.
హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాలతో పాటు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్థంభాలు విరిగిపడే అవకాశం ఉందని..అలాంటివి సంభవిస్తే వెంటనే క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా ఉదయం నుంచి ఎండవేడితో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు వరుణుడు ఉపసమనాన్ని కలిగించాడు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఎండల నుంచి ఉపసమనం పొందుతున్నారు. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. కాగా మరో రెండ్రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..