Telangana Martyrs Memorial – Amara Deepam: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు (జూన్ 22) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా “తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం’’ ప్రజ్వలన కార్యక్రమం గురువారం సాయంత్రం జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున యావత్ తెలంగాణ సమాజం గర్వించే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా, వారి ఆశయాలు ప్రజలకు నిత్యం స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘అమరవీరుల దీపం’ హుస్సేన్ సాగర్ తీరాన ప్రతి రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా ఆరు అంతస్తుల్లో ప్రభుత్వం అమరవీరుల జ్యోతిని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్కు సమీపంలో 3.29 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇందు కోసం కేటాయించింది. ఈ స్థలంలో 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో అమరవీరుల స్మారక భవనాన్ని నిర్మించారు. 54, 37 అక్షాల పొడవుతో దీర్ఘవృత్తాకారంలో ప్రమిదను రూపొందించారు. దీనికి ఒక వైపు 26 మీటర్ల ఎత్తు, మరో వైపు 18 మీటర్ల ఎత్తుతో, మొత్తంగా గ్రౌండ్ లెవల్ నుండి 45 మీటర్ల ఎత్తులో దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. స్మారక భవనం నిర్మాణానికి మొత్తంగా 1,600 మెట్రిక్ టన్నుల స్టెయిన్ లెస్ స్టీల్ ను వినియోగించారు.
బేస్ మెంట్ – 1: దీని విస్తీర్ణం 1,06,993 చదరపు అడుగులు. 160 కార్లు, 200 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం వుంది.
బేస్ మెంట్ – 2: ఇది 1,06,993 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మితమైంది. 175 కార్లు, 200 ద్విచక్రవాహనాలకు పార్కింగ్ సౌకర్యం. లాంజ్ ఏరియా, లిఫ్ట్ లాబీ, భూగర్భంలో 3 లక్షల లీటర్ల నీటి సామర్థ్యమున్న సంప్ (నీటి గుంట)లను ఏర్పాటు చేశారు.
గ్రౌండ్ ఫ్లోర్: దీని విస్తీర్ణం 28,707 చదరపు అడుగులు. ఇందులో మెయింటనెన్స్, సివిల్, ఎలక్ట్రికల్ కార్యకలాపాలు.
మొదటి అంతస్తు: దీని విస్తీర్ణం 10,656 చదరపు అడుగులు. ఇందులో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, 70 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడియో, విజువల్ రూమ్.
రెండవ అంతస్తు: దీని విస్తీర్ణం 16,964 చదరపు అడుగులు. కన్వెన్షన్ హాల్, లాబీ ఏరియా.
మూడవ అంతస్తు (టెర్రస్): దీని విస్తీర్ణం 8,095 చదరపు అడుగులు. కూర్చునే ప్రదేశం, ప్యాంట్రీ ఏరియాతో కూడిన రెస్టారెంట్, వ్యూ పాయింట్, ఓపెన్ టెర్రస్ సీటింగ్ వున్నాయి.
మెజ్జనైన్ ఫ్లోర్: దీని విస్తీర్ణం 5,900 చదరపు అడుగులు. గ్లాస్ రూఫ్ తో కూడిన రెస్టారెంట్, ఓవర్ హెడ్ ట్యాంకు
అమర దీపం: తక్కువ కార్బన్ స్ట్రక్చరల్ స్టీల్ తో తయారైన 26 మీటర్ల జ్వాల. ఇది గోల్డెన్ ఎల్లో కలర్ లో ప్రకాశిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..