Hyderabad: అతిపెద్ద క్రైస్తవ వేడుకకు వేదిక కానున్న హైదరాబాద్.. హాజరుకానున్న కార్డినల్స్, అగ్ర పీఠాధిపతులు
మహాఘన పూల అంథోని (Anthony Cardinal Poola) కార్డినల్ అయిన సందర్భంగా ప్రత్యేక ప్రార్ధన నిర్వహించనున్నారు. ముంబాయి కార్డినల్ ఒస్వాల్డ్ గ్రేసియస్ ఈ మహోత్సవ ప్రధాన పూజను ప్రారంభించనున్నారు.
Christian celebration in Hyderabad: అతిపెద్ద క్రైస్తవ వేడుకకు హైదరాబాద్ వేదిక కానుంది. గురువారం (సెప్టెంబర్ 15న) జరిగే క్యాథలిక్ అగ్రపీఠం వేడుకకు ఇద్దరు కార్డినళ్ళు, 15 మంది పీఠాధిపతులు, 500 మంది గురువులు హాజరు కానున్నారు. మహాఘన పూల అంథోని (Anthony Cardinal Poola) కార్డినల్ అయిన సందర్భంగా ప్రత్యేక ప్రార్ధన నిర్వహించనున్నారు. ముంబాయి కార్డినల్ ఒస్వాల్డ్ గ్రేసియస్ ఈ మహోత్సవ ప్రధాన పూజను ప్రారంభించనున్నారు. అట్టడుగు వర్గాల కోసం కార్డినల్ పూల అంథోని ఇకనుంచి సేవలందించనున్నారు. సెంట్మరీస్ హైస్కూల్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోయే మహోత్సవ ప్రధాన పూజలో వేలాదిమంది క్రైస్తవ, కథోలిక విశ్వాసులు పాల్గొననున్నారు.
ఇటీవల ఆగస్టు 27న వాటికన్ నగరంలో జరిగిన వేడుకలలో పోప్ ఫ్రాన్సిస్.. హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహాఘన పూల అంథోనిని కార్డినల్గా నియమించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కార్యక్రమ మీడియా కమిటీ కన్వీనర్ ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి మాట్లాడుతూ.. 2000 సం॥రాల తెలుగు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి తెలుగు కార్డినల్గా పూల అంథోని నిలిచారన్నారు. ఆర్చిబిషప్ పూల అంథోని కార్డినల్గా పదోన్నతి పొందిన సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా పూజను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో అగ్ర పీఠాధిపతి రఫేమాంజలి, భారతదేశం, నేపాల్ అపోస్తలిక్ మున్షియో, బెర్హంపూర్ పీఠాదిపతి శరత్చంద్రనాయక్, బెంగుళూరు వికార్డజనరల్ సి. ఫ్రాన్సిస్, బల్లారి పీరాధిపతి హెన్రీ డినేజా హాజరుకానున్నారని తెలిపారు.
ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన పీఠాధిపతి పూల అంథోని జనవరి 2021లో హైదరాబాద్ అగ్ర పీఠాదిపతిగా నియమితులై.. కార్డినల్ గా ఎదిగారు. ఇటీవల పోపుగారు. ప్రపంచవ్యాప్తంగా 21 మందిని కొత్తగా కార్డినల్స్ గా ప్రకటించారు. వారిలో ఇద్దరు భారతదేశం చెందినవారున్నారు. పూలఅంథోనితోపాటు గోవా అగ్రపీఠాధిపతి ఫిలిప్నారి అంటోనియో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం