కోకోపేట్.. కెవ్వు కేక అంటోంది. అవును మరి… కోకాపేటా మజాకా..! రియలెస్టేట్ రంగంలో మళ్లీ అదరగొట్టింది కోకాపేట. కోకాపేట భూముల ధరలు కేక పుట్టిస్తున్నాయి. అంచనాలకు మించి.. రికార్డులు తిరగరాస్తూ.. రేట్లు పలుకుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో హాట్ కేకుల్లా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి. కోకాపేట నియోపోలీస్ భూములు వేలంలో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.
హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో HMDA భూముల వేలం జరుగుతోంది. రికార్డు స్థాయి ధర పలికి దుమ్ము దులిపేసింది కోకాపేట్ నియోపోలిస్. ఫేజ్ 2లో భాగంగా మోర్నింగ్ సెషనల్. 6,7, 8, 9 ప్లాట్లకు హెచ్‌ఎండీ వేలం వేసింది. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలుగా ఉంది. ఈ లెక్కన ఎకరం భూమికి 35 కోట్ల రూపాయలుగా ధరను నిర్ణయించింది హెచ్ఎండీఏ. అయితే.. హైదరాబాద్ చరిత్రలో నియోపోలిస్ భూముల ధరలు రికార్డులు సృష్టించాయి. ప్లాట్ నెంబర్ 6లో ఎకరం రూ. 71.25 కోట్లు పలకగా, ప్లాట్ నెంబర్ 7లో ఎకరం రూ. 75.50 కోట్లు పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 8లో ఎకరం రూ. 63.50 కోట్లు, ప్లాట్ నెంబర్ 9లో ఎకరం రూ. 73.50 కోట్లు పలికింది.
ఇక సాయంత్రం సెషన్‌లో కోకా పేట భూముల ధరలు రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త చరిత్రను తిరగరాశాయి. దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమి కోకాపేటదే అని తేలిపోయింది. కోకాపేట నియోపోలీస్ భూముల వేలంలో ఎకరం రూ. వంద కోట్లు దాటి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. సాయంత్రం సెషన్ విషయానికొస్తే.. ప్లాట్ నెంబర్ 10లో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ప్లాట్ నెంబర్ 11లో ఎకరం రూ. 58.25 కోట్ల ధర పలికింది.
ఇదిలా ఉంటే గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం వచ్చింది. అప్పుడు కనిష్టంగా ఎకరా రూ.31 కోట్ల నుంచి అత్యధికంగా రూ.60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు ఏకంగా ఎకరం 100 కోట్లు దాటి సన్సేషనల్ సృష్టించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2500 కోట్లకు పైనే ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు.
ఇక నిధుల సమీకరణ కోసం HMDA గురువారం భూముల అమ్మక ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. కోకాపేట్‌లోని నియో పోలీస్ లే అవుట్‌లో మొత్తం 45.33 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. ఉదయం నిర్వహించిన వేలంలో మొత్తం నాలుగు ప్లాట్లకు వేలం చేపట్టారు. వీటిలో ఒక ఫ్లాట్ అత్యధికంగా ఎకరం ఏకంగా రూ. 72 కోట్లకు అమ్ముపోయింది. ఈ వేలంలో ప్లాట్ల కోసం రియల్టర్లు ఎగబడ్డారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..