AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రమాదం కాదు పక్కా మర్డర్..! అడ్వొకేట్ హత్య కేసులో సంచలన నిజాలు

హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన అడ్వొకేట్ ఖాజా మొయిజుద్దీన్ మృతి కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తొలుత సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక.. పక్కా స్కెచ్‌తో అమలు చేసిన ఒక భారీ సుపారీ హత్య కుట్ర దాగి ఉందని పోలీసులు తేల్చారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఓ బైక్ స్టంటర్‌కు రూ. 2 లక్షల సుపారీ ఇచ్చినట్లు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

Hyderabad: ప్రమాదం కాదు పక్కా మర్డర్..! అడ్వొకేట్ హత్య కేసులో సంచలన నిజాలు
Advocate Khaja Moizuddin Murder Case
Ranjith Muppidi
| Edited By: |

Updated on: May 31, 2026 | 8:58 PM

Share

అడ్వొకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళికతో అమలు చేసిన సుపారీ హత్య కుట్ర దాగి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియాలో బైక్ స్టంట్ల వీడియోలు పోస్టు చేసే ఓ యువకుడిని ఈ హత్యను ప్రమాదంలా చిత్రీకరించేలా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు ముజాహిద్ ఆలం ఖాన్ అడ్వొకేట్ మొయిజుద్దీన్‌ను హత్య చేయాలని నిర్ణయించి, ఆ బాధ్యతను వినయ్ అనే వ్యక్తికి అప్పగించినట్లు తెలుస్తోంది. అనంతరం వినయ్, అభిజిత్ అలియాస్ నాని అనే యువకుడిని రంగంలోకి దింపాడు. రోడ్డు ప్రమాదంలా కనిపించేలా కారుతో ఢీకొట్టి హత్య చేయాలని అతడికి సూచించినట్లు పోలీసులు చెబుతున్నారు.

హత్యను అమలు చేస్తే రూ.2 లక్షలు ఇస్తామని అభిజిత్‌కు హామీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకవేళ పట్టుబడినా అది ప్రమాద కేసుగా నమోదవుతుందని, త్వరగా బెయిల్ కూడా లభిస్తుందని వినయ్ నమ్మబలికినట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బు ఆశతో అభిజిత్ ఈ నేరానికి ఒప్పుకున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ఏడాది మే 23న మాసాబ్‌ట్యాంక్‌లోని తన నివాసం సమీపంలో అడ్వొకేట్ ఖాజా మొయిజుద్దీన్‌పై ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లి ఢీకొట్టింది. తొలుత ఇది ప్రమాదంలా కనిపించినప్పటికీ, దర్యాప్తులో ఇది ఉద్దేశపూర్వక హత్యగా తేలింది. అడ్వొకేట్ కదలికలపై జనవరి నెల నుంచే నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో వక్ఫ్ ఆస్తుల వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా బయటపడింది. మలక్‌పేట్, లక్డీకాపూల్ ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, యాజమాన్యానికి సంబంధించి ముజాహిద్ ఆలం ఖాన్ కుటుంబానికి, అడ్వొకేట్ మొయిజుద్దీన్‌కు మధ్య 2013 నుంచి వివాదాలు కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఇరుపక్షాల మధ్య పలు సివిల్, క్రిమినల్, వక్ఫ్ ట్రిబ్యునల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యను అమలు చేయడానికి నిందితులకు రూ.15 లక్షల వరకు సుపారీ అందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేరంతో తమకు సంబంధం లేకుండా కనిపించేలా మధ్యవర్తుల ద్వారా డబ్బు బదిలీ చేసినట్లు గుర్తించారు. హత్యకు వినియోగించిన స్కార్పియో వాహనం కొనుగోలు కోసం ముందుగానే రూ.2 లక్షలు సమకూర్చినట్లు కూడా దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన కుట్రదారుడిగా ముజాహిద్ ఆలం ఖాన్‌ను గుర్తించిన పోలీసులు, అతడి తండ్రి మహబూబ్ ఆలం ఖాన్‌తో పాటు హసన్ అలీ అలియాస్ చౌస్, మునీర్ తదితరులు కూడా కుట్రలో భాగమైనట్లు వెల్లడించారు. అభిజిత్ అలియాస్ నాని నుంచి రూ.2.80 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాల సేకరణతో పాటు డబ్బు లావాదేవీల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us