మారుతోన్న జీవనశైలి, పని సంస్కృతి కారణంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడం, తీసుకునే ఆహారంలో మార్పులు రావడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరగడం, ఏసీల్లో కూర్చొని పని చేయడం కారణంగా చాలా మందికి తగినంత సూర్యరక్ష్మి తగలడం లేదు. దీంతో డీ విటమిన్ లోపంతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇదే విషయమై టాటా 1ఎంజీ ల్యాబ్స్ అధ్యయనం నిర్వహించింది. ఇందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరబాద్ నగరంలో దాదాపు 76 శాతానికి పైగా ప్రజలు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటని తేల్చింది. హైదరాబాద్‌లో 76% మంది ప్రజలు ‘డీ’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.
మరీ ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం వదోదర (89%), సూరత్ (88%) అహ్మదాబాద్ (85%) నగరాలకు చెందిన ప్రజలు అత్యధికుల్లో విటమిన్ డీ లోపం ఉంది. అంతేకాదు పెద్దవారితో పోలిస్తే యువతలో ఈ లోపం ఎక్కువగా ఉండడం గమనార్హం. 25 ఏళ్లలోపు వారు 84% మందిలో, 25–40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 81% మందిలో ‘డీ’ విటమిన్ ఉండాల్సిన స్థాయిలో లేదని అధ్యయనంలో తేలింది.
నేటి తరం పిల్లల్లో శారీరక శ్రమ తగ్గడం, క్రీడలపై ఆసక్తి తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయం ఆఫీసుల్లో ఏసీ గదుల్లోనే గడుపుతుండడం, ఎండతగలకపోవడం, తీసుకునే ఆహారంలో నియమాలు పాటించకపోవడమే విటమిన్‌డీ లోపానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డీ లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గిపోయి బోలు ఎముకల వ్యాధికి లేదా ఆ్రస్టియోపోరోసిస్‌కు దారి తీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఉదయం ఎండ పడేలా ఉంటే విటమిన్ డి లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. అంతేకాకుండా తీసుకునే ఆహారం ద్వారా కూడా విటమిన్ డి లోపానికి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు చేపలు, సముద్రపు ఆహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. పాలల్లో అధిక మొత్తంలో విటమిన్ డి, కాల్షియం ఉంటాయి. ఆవు పాలలో విటమిన్ డీ ఆధిక మొత్తంలో లభిస్తుంది. పెరుగు ఎముకలను బలపరచడమే కాకుండా కడుపు సమస్యలను దూరం చేస్తుంది. చేపల నుంచి కూడా విటమిన్ డి పొందవచ్చు. అలాగే విటమిన్ ఇ, బి12 కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి. ఆరెంజ్ శరీరానికి విటమిన్ సి ఇవ్వడమే కాకుండా..విటమిన్ డీ లోపాన్ని తగ్గిస్తుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..