Aadhaar Free Update: తల్లిదండ్రులకు బిగ్ రిలీఫ్.. ఇకపై స్కూల్‌లోనే ఆధార్ అప్డేట్స్.. ఇదిగో డిటైల్స్..
విద్యార్థులు సహా.. అందరికీ.. ప్రభుత్వానికి సంబంధించి మనకు ఏ సేవ కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. చిన్న చిన్న మార్పు చేయాలన్నా.. ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ముందుగా పేరు నమోదు, ఆ తర్వాత క్యూ, గంటల తరబడి వేచి ఉండటం.. ఈ ప్రక్రియ విద్యార్థులు, తల్లిదండ్రులకు పెద్ద ఇబ్బందిగానే మారింది.

విద్యార్థులు సహా.. అందరికీ.. ప్రభుత్వానికి సంబంధించి మనకు ఏ సేవ కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. చిన్న చిన్న మార్పు చేయాలన్నా.. ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ముందుగా పేరు నమోదు, ఆ తర్వాత క్యూ, గంటల తరబడి వేచి ఉండటం.. ఈ ప్రక్రియ విద్యార్థులు, తల్లిదండ్రులకు పెద్ద ఇబ్బందిగానే మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ రిజిస్ట్రేషన్ లేదా అప్డేట్స్ కోసం విద్యార్థులు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పాఠశాలల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
5 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు తొలి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌ను ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా చేస్తామని తెలిపారు. రెండోసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయాలనుకుంటే రూ.125 చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో వివరాల మార్పులకు రూ.75 ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్యాంపులు ఎప్పుడు, ఏ పాఠశాలలో నిర్వహిస్తారన్న పూర్తి వివరాల కోసం జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. స్కూల్‌లోనే ఆధార్ అప్డేట్స్ పూర్తయ్యే అవకాశం కలగడంతో పిల్లల చదువు మానేసి బయట తిరగాల్సిన అవసరం ఉండదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
సరికొత్త ఆధార్ యాప్.. ఇకపై మరింత సులువుగా..
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా సరికొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌తో ఆధార్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ వెరిఫికేషన్‌ను వెంటనే పూర్తిచేసుకునే అవకాశం, అడ్రస్, మొబైల్ నంబర్ అప్డేట్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, అవసరమైన వివరాలు మాత్రమే కనిపించేలా ఆధార్‌ను షేర్ చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఒకే యాప్‌లో ఐదుగురి వరకు ప్రొఫైల్ వివరాలు క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మొత్తంగా చూస్తే.. స్కూల్‌ల్లో ఆధార్ క్యాంపులు, కొత్త ఆధార్ యాప్‌తో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చర్యలు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులు తగ్గించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
