AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hajj Yatra 2025: అయ్యో భగవంతుడా.. 18 మందిని ఒకేసారి తీసుకెళ్లావా.. మూడు తరాల కుటుంబం అగ్నికి ఆహుతి..

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయ యాత్రికులలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులు ఉన్నారు.. వారిలో తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మూడు తరాలకు సంబంధించిన ఈ కుటుంబం శనివారం తిరిగి రావాల్సి ఉందని వారి బంధువులు తెలిపారు.

Hajj Yatra 2025: అయ్యో భగవంతుడా.. 18 మందిని ఒకేసారి తీసుకెళ్లావా.. మూడు తరాల కుటుంబం అగ్నికి ఆహుతి..
18 Members Of Hyderabad Family Killed In Medina Bus Crash
Shaik Madar Saheb
|

Updated on: Nov 18, 2025 | 8:55 AM

Share

ముస్లింల పవిత్ర క్షేత్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మదీనాకు వెళ్తున్న బస్సు మంటల్లో ఆహుతైంది. హైదరాబాద్‌కు చెందిన 45మంది ఉమ్రా యాత్రికులు ఈ దుర్ఘటనలో సజీవదహనం కావటం అందరినీ విషాదంలో ముంచెత్తింది. బాధిత కుటుంబ సభ్యులను సౌదీ తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.. బస్సు ప్రమాద మృతులకు సౌదీలోని మదీనాలో మంగళవారం అంత్యక్రియలు జరుగుతాయి.. ఈ మేరకు తెలంగాణ నుంచి సౌదీకి ఓ బృందాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపింది. అయితే.. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయ యాత్రికులలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులు ఉన్నారు.. వారిలో తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మూడు తరాలకు సంబంధించిన ఈ కుటుంబం శనివారం తిరిగి రావాల్సి ఉందని వారి బంధువులు తెలిపారు. ఒకే ఫ్యామిలీకి చెందిన 18మంది ఒకే ప్రమాదంలో చనిపోవడం.. హైదరాబాద్‌ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. పెను విషాదాన్ని నింపిన సౌదీ బస్సుప్రమాదంతో ఇక్కడున్న వారి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముందు 7 రోజులు హజ్‌ యాత్ర.. అక్కడి నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లి.. 14 రోజుల పాటు పవిత్ర యాత్రలో పాలుపంచుకుని.. తిరిగి హైదరాబాద్‌ రావాలన్నదే వారి ప్రణాళిక. కాని.. జరిగింది వేరు. ఏడు రోజుల మక్కాయాత్ర తర్వాత మదీనాకు బయల్దేరిన వారు.. గమ్యాన్ని చేరుకోకుండానే అర్థరాత్రి ప్రాణాలు కోల్పోయారు. 10మంది చిన్నారులతో సహా మొత్తం 45మంది హైదరాబాద్‌ వాసులు.. అగ్నికి ఆహుతయ్యారు.

ప్రమాదంలో టోలిచౌకీ, నటరాజ్‌నగర్‌, జిర్రా ప్రాంతాల్లో చనిపోయిన వారి ఇళ్ల దగ్గర విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన 45మందికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్‌ కుటుంబంలో 18మంది మరణించారు. వారందరికీ అక్కడే అంతిమసంస్కారాలు చేస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు.

9 మంది పెద్దవాళ్లు, 9 మంది చిన్న పిల్లలు..

“నా వదిన, బావ, వారి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు, వారి పిల్లలు (ఉమ్రా కోసం) వెళ్లారు. వారు ఎనిమిది రోజుల క్రితం బయలుదేరారు. ఉమ్రా పూర్తయింది, వారు మదీనాకు తిరిగి వెళ్తుండగా.. తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది, బస్సు మంటల్లో కాలిపోయింది. వారు శనివారం తిరిగి రావాల్సి ఉంది” అని మొహమ్మద్ ఆసిఫ్ చెప్పారు. “ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది సభ్యులు – తొమ్మిది మంది పెద్దలు – తొమ్మిది మంది పిల్లలు మరణించారు. ఇది మాకు చాలా భయంకరమైన విషాదం” అని ఆయన అన్నారు.

ఆసిఫ్ తన బంధువులలో కొంతమందిని నసీరుద్దీన్ (70), అతని భార్య అక్తర్ బేగం (62), కుమారుడు సలావుద్దీన్ (42), కుమార్తెలు అమీనా (44), రిజ్వానా (38), షబానా (40) వారి పిల్లలుగా పేర్కొన్నారు. నసీరుద్దీన్ – అతని కుటుంబం నివసించే రామ్‌నగర్‌లోని ఇంట్లో నివాసముంటుంది.

అయితే చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. కొందరి మృతదేహాలు బూడిదైపోయినట్లు చెబుతున్నారు. మృతుల డీఎన్‌ఏని సేకరించి.. వారి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో పోల్చి చూడనున్నారు. మృతులందరికీ మదీనాలోని శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తోంది.

ఇప్పటికే మంత్రి అజారుద్దీన్‌, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌తో కూడిన బృందం‌ సౌదీ అరేబియా బయల్దేరి వెళ్లారు. అక్కడి అధికారులతో సమన్వయం చేయనున్నారు. మృతుల అంత్యక్రియలు అయ్యేవరకు అక్కడే ఉండనున్నారు. ప్రతీ కుటుంబం నుంచి సభ్యులను తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలను నిర్వహిస్తామని.. ప్రభుత్వం చెప్పింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..