
అనైతిక బంధాలకు సొంతవారినే కాదనుకుంటున్నారు. పరాయి మోజులో పడి తాళికట్టిన భర్తనే ఓ భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. ప్రియుడితో కలిసి భర్తను భార్యే హత్య చేసిన ఘటన హైదరాబాద్ మహానగరంలో కలకలం రేపింది. హత్యను గుండెపోటుగా మార్చేందుకు ప్రయత్నించిన నిందితులు.. మృతదేహంపై గాయాలతో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.
జెల్లెల శేఖర్.. చిట్టి దంపతులు.. హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ కోదండరాం నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరికీ 16ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ.. వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు శేఖర్. అప్పుడప్పుడు గిరాకీని బట్టి లాంగ్ డ్రైవ్ వెళ్లేవాడు. ఆ సమయంలో హరీష్ అనే వ్యక్తికి కనెక్ట్ అయింది చిట్టి. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. చాలా రోజులుగా గుట్టుగా సాగుతోందీ వ్యవహారం. ఓ రోజు భర్తకు అనుమానం రావడంతో భార్యపై ఫోకస్ పెట్టాడు. అప్పుడు బయటపడింది ఇల్లీగల్ రిలేషన్.
సంబంధం సరికాదని.. పద్దతిగా మార్చుకోవాలని భార్య చిట్టిని మందలించాడు భర్త శేఖర్. దీంతో తమ శారీరక సుఖం కోసం శేఖర్ అడ్డు అని భావించారు చిట్టి, హరీష్. హత్యకు స్కెచ్ వేశారు. డ్రైవింగ్‌కి వెళ్లి ఇంటికొచ్చిన శేఖర్.. రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో హరీష్‌కి కాల్ చేసి ఇంటికి పిలిపించింది చిట్టి. ఒకరు గొంతు నులుమగా మరొకరు తలపై డంబెల్‌తో మోది హతమార్చారు. తమపై అనుమానం రాకుండా డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న సరూర్‌నగర్ పోలీసులు.. గాయాలైన శేఖర్‌ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు.. తలపై గాయాల కారణంగానే చనిపోయినట్టు నిర్ధారించారు.
శేఖర్ మృత దేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. భార్య చిట్టిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మొదట్లో తడబడింది. ఆ తర్వాత కాస్త గట్టిగా అడగడంతో ప్రియుడితో కలిసి హతమార్చినట్టు అంగీకరించింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని బంధువులు చెబుతున్నారు. వాటి కారణంగా ఇంత చిట్టి ఇంత దారుణానికి తెగబడుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భర్త హత్యకు గురయ్యాడు భార్య అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరు పిల్లల పరిస్థితేంటి? పరాయి మోజులో పడి కట్టుకున్న వాడిని కిరాతకంగా చంపేసి చిట్టి సాధించిందేంటి? క్షణిక సుఖాల కోసం వెంపర్లాడితే చివరకు జరిగితే అనర్ధమేనని మరోసారి రుజువు చేసిందీ ఘటన.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..