AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ప్రిన్సిపల్ సంచలన నిర్ణయం!

నగరంలోని ప్రముఖ ఉస్మానియా డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఫస్టియర్ బిడియస్ (BDS) విద్యార్థులను మానసికంగా, భౌతికంగా వేధించిన 12 మంది ఫైనలియర్ విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. బాధ్యులైన 12 మంది విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేయడంతో పాటు, సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు నమోదు చేశారు.

Hyderabad: ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ప్రిన్సిపల్ సంచలన నిర్ణయం!
Osmania Dental College Ragging
Anand T
|

Updated on: Jun 17, 2026 | 3:15 PM

Share

హైదరాబాద్‌లోని ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. తమను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని..జూనియర్ విద్యార్థులు కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సర్జీవ్ సింగ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 9న ఫస్టియర్ చదువుతున్న బిడియస్ విద్యార్థులు . ఫైనలియర్ విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన ప్రిన్సిపల్, అదే రోజున ఇరు వర్గాల విద్యార్థులను పిలిపించి మాట్లాడారు. సీనియర్లకు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి, ర్యాగింగ్ వల్ల వచ్చే పరిణామాలపై హెచ్చరించారు. ఆ తర్వాత ఇరు వర్గాలను కాంప్రమైజ్ చేసి, ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకునేలా చేశారు.

అయితే, యాజమాన్యం హెచ్చరించిన 24 గంటలైనా గడవకముందే సీనియర్ విద్యార్థులు మళ్లీ బరితెగించారు. జూన్ 10వ తేదీన జూనియర్లపై మరోసారి బెదిరింపులకు దిగడమే కాకుండా, భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు. సీనియర్ల వేధింపులు మితిమీరడంతో జూనియర్ విద్యార్థులు మళ్లీ ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రతను దృష్టిలో ఉంచుకుని కాలేజీ యాజమాన్యం ఈసారి కఠినంగా వ్యవహరించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది ఫైనలియర్ విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు సదరు 12 మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై ఉస్మానియా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ టీవీ9తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కళాశాలలో ర్యాగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. విద్యార్థులు ఇలాంటి అనాగరిక పనులకు పాల్పడి తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. కాలేజీలో ఎక్కడ, ఎవరు ర్యాగింగ్‌కు పాల్పడినా తక్షణమే కఠిన చర్యలు ఉంటాయి. ఇందులో స్టాఫ్, ఫస్టియర్, ఫైనలియర్ అనే తేడాలు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు కూడా పూర్తి బాధ్యత ఉంటుందని అన్నారు. ర్యాగింగ్ ఫిర్యాదులపై కాలేజీ యాజమాన్యం అత్యంత పారదర్శకంగా, వేగంగా విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us