మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా మరో కీలక ఒప్పదం.. పూణేకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను అందించేందుకు ఎంవోయూ
మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఎవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో ఘనత సాధించింది. మహారాష్ట్రకు చెందిన పీఎంపీఎల్ సంస్థకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు అనుమతి పొందింది.
Olectra electric buses to Pune : ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామి అయిన మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఎవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో ఘనత సాధించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తున్న ఒలెక్ట్రా సంస్థ.. మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మహారాష్ట్రకు చెందిన పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్) సంస్థకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు అనుమతి పొందింది. ఈ మేరకు గురువారం రెండు కంపెనీలకు చెందిన అధికారుల మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి.
పర్యావరణ రహిత కోసం కాలుష్యాన్ని తగ్గేంచే దిశగా భారత ప్రభుత్వ ఫేమ్ –2 పథకంలో భాగంగా ఈ బస్సులను రూపొందించారు. ఇందులో భాగంగా 350 బస్సులను పుణేకు చెందిన పీఎంపీఎల్ సంస్థకు అందించనున్నారు. ఈ 350 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) / ఓపేక్స్ మాడర్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పరిధిలో సరఫరా చేయవలసి ఉంటుంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఎవీ ట్రాన్స్ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులను సేకరించనుంది. ఈ బస్సులను ఎడు నెలల కాలంలో ఒలెక్ట్రా సంస్థ అందించనుంది. కాంట్రాక్ట్ కాలంలో ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా ఎవీ ట్రాన్స్ పరిధిలోనే ఉంటుంది. ఈ కొత్త ఆర్డర్ తో కలిపి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఇప్పటి వరకు 1,250కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది. ఇటీవల 353 బస్సుల కోసం ప్రకటించిన బిడ్‌లో భాగంగా అతి తక్కువగా కోట్ చేసి ఎవీ ట్రాన్స్ ఈ 350 బస్సుల ఆర్డర్‌ను దక్కించుకుంది
ఒక రాష్ట్రంలో అత్యధికంగా బస్సులను సరఫరా చేసిన ఘనత ఒలెక్ట్రా సంస్థ సొంతం
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) సీఈఓ & సీఎఫ్ఓ శరత్ చంద్ర మాట్లాడుతూ.. “పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ నుంచి 350 ఎలెక్ట్రిక్ బస్సుల ఆర్డర్ దక్కించుకున్నందుకు చాలా సంతోషం. ఇప్పటికే ఎవీ ట్రాన్స్ పూణేలో 300 ఎలెక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామన్నారు. ఈ కొత్త బస్సుల రాకతో దీని సంఖ్య ఇప్పుడు 650కి చేరిందన్నారు. ఇది దేశంలోనే ఒక రాష్ట్రంలో అత్యధికంగా బస్సులను సరఫరా చేసిన ఘనత ఒలెక్ట్రా సంస్థకు దక్కుతుందన్నారు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఎవీ ట్రాన్స్ బృందానికి చాలా గర్వంగా ఉందని శరత్ చంద్ర ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఎంటీసీ బిడ్డింగ్‌లో ఎల్-1గా నిలిచిన ఒలెక్ట్రా
ఇక, భారత సికాన్ వ్యాలీగా పేరుగాంచిన గ్రీన్ సిటీ బెంగళూరుకు సైతం 300 బస్సులను సరఫరా చేయడానికి పిలిచిన టెండర్లలో ఒలెక్ట్రా సంస్థ ఎల్-1గా నిలిచింది. ఫేమ్ – 2 పథకంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (బీఎంటీసీ) 300 విద్యుత్ బస్సులకు గాను నిర్వహించిన టెండర్లలో అతి తక్కువగా బిడ్డింగ్ కోట్ చేసిన ఒలెక్ట్రా ఎల్-1గా నిలిచింది. ఈ 300 ఎలక్ట్రిక్ బస్సులను జీసీసీ ఓపెక్స్ మోడల్ ప్రతిపాదికన 12 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కూడా ఒలెక్ట్రా సంస్థ చేపట్టనుంది. ఈవీ ట్రాన్స్‌కి 300 బస్సుల సరఫరాకు సంబంధించి అనుమతి లభించిన వెంటనే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి ఏడాది కాలంలో సేకరించనుంది.
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు ప్రత్యేకతలు
12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 33 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ను కూడా ఏర్పాటు చేశారు. బస్సులో అమర్చిన లిథియమ్ ఇయాన్ (Li ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్ ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 2 నుంచి 5 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.
మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్
మేఘా ఇంజనీరింగ్ వారి అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 2000లో స్థాపించారు. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపనీ. 2015 లోనే దేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంస్థ. విద్యుత్ ప్రసారం, పంపిణీ నెట్‌వర్క్‌ల కోసం సిలికాన్ రబ్బరు, కంపోసిట్ ఇన్ స్యూలేటర్ల అతిపెద్ద తయారీదారు. దేశంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ ఒలెక్ట్రా బస్సులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. దేశంలో మొట్ట మొదటిసారిగా ఒలెక్ట్రా బస్సు 13,000 అడుగులు(3,962.4 మీటర్లు) ఎత్తు ఉన్న ఱోహాతంగ్ పాస్ వరకు ప్రయాణం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.