
దేశంలోనే అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటైన మెట్రో రైలు, మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. వీరిలో మహిళలు సుమారు 30 శాతం మంది ఉండగా, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత. తెలంగాణ ప్రభుత్వ సమానత్వం, గౌరవం, సమాన అవకాశాల దృష్టితో, వివిధ ప్రజా సేవా రంగాల్లో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది నియామకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. ఈ దిశగా, హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రగతిశీలమైన, ప్రభావవంతమైన అడుగు వేసి, 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించింది. ప్రత్యేక శిక్షణ పూర్తి చేసిన ఈ సిబ్బంది, సోమవారం నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో విధులు ప్రారంభించారు.
ఈ చొరవతో మహిళా ప్రయాణికుల భద్రతా వాతావరణం మరింత బలపడటమే కాకుండా, సామాజిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందనీ అధికారులు అంటున్నారు.కొత్తగా నియమితులైన వారు,జనరల్ మరియు మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లలో భద్రతా చర్యలు చేపట్టడం, ప్రయాణికులకు దిశానిర్దేశం చేయడం, సమాచారం, అవసరమైన సహాయం అందించడానికి అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా, సురక్షితంగా వెళ్లేలా స్కానర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. స్ట్రీట్-లెవెల్, కాన్‌కోర్స్ భద్రత లో కూడా పాలుపంచుకుంటారు. హైదరాబాద్ మెట్రో రైలు, ప్రయాణికులకు సురక్షితమైన,సమర్థవంతమైనమొబిలిటీని అందించడానికి కట్టుబడి ఉంది. ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించడం, మహిళా ప్రయాణికుల భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, సామాజిక సాధికారతకు ఒక శక్తివంతమైన సంకేతంగా నిలుస్తుంది.