తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు అందింది. మరో మూడ్రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యాస్ తుఫాన్ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వర్షం పడుతోంది. అయితే ముందస్తుగా వస్తున్న నైరుతి తెలంగాణ, ఆంధ్ర రైతుల్లో కొత్త ఆనందాన్ని నింపుతోంది.
నైరుతి రుతుపవనాల ఎంట్రీతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 31న నైరుతి రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈరోజు ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ వరకు సముద్రమట్టానికి 1.5కిలో మీటర్ల నుంచి 2.1కిలో మీటర్ల మధ్య ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.
రాగల మూడ్రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.