
మన్నెగూడ కిడ్నాప్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ నుంచి విజయవాడవైపు పారిపోతుండగా నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నల్గొండజిల్లా మంచన్‌పల్లి వద్ద వైశాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైశాలి, నవీన్ రెడ్డిలను ఒకే చోట విచారిస్తున్నారు. వైశాలి కుటుంబ సభ్యులపై దాడి, ఆస్తుల ధ్వంసంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆదిభట్ల పోలీసులు. అయితే 2021లోనే తమ పెళ్ళిజరిగిందంటూ నవీన్ వెల్లడించడం కిడ్నాప్ కేసులో మరో కొత్తకోణానికి తెరతీసింది. బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో పెళ్ళి జరిగినట్టు వెల్లడించాడు నిందితుడు. కాగా, పోలీసులకు నవీన్ తెలిపిన వివరాలకు సంబంధించిన స్టేట్‌మెంట్ కాపీ టీవీ9 చేతికి అందింది. అందులో ఊహించని ట్విస్ట్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
నవీన్-వైశాలి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరికీ గతంలోనే వివాహం జరిగినట్లు తెలిస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వైశాలితో తనకు గతంలో వివాహం జరిగిందని నవీన్ వెల్లడించాడు. 2021 ఆగస్టు 4వ తేదీన బాపట్ల జిల్లా వలపర్ల టెంపుల్‌లో తమ వివాహం జరిగిందని వివరించాడు నవీన్. అయితే, బిడిఎస్ కంప్లీట్ అయ్యేదాకా పెళ్లి ఫొటోస్ బయటకు రావొద్దని వైశాలి కండీషన్ పెట్టిందన్నాడు. 2021 జనవరి నుంచి తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలిపాడు నవీన్. వైశాలి కుటుంబ సభ్యులు తనతో డబ్బులు ఖర్చుపెట్టించారని ఆరోపించాడు. వైశాలి తల్లితండ్రులు కూడా బిడిఎస్ పూర్తవగానే పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని, కానీ, ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపించాడు. తన డబ్బుతో వైశాలి కుటుంబ సభ్యులు వైజాగ్, అరకు, వంజంగి, కూర్గ్, మంగుళూరు, గోకర్ణా, గోవాకు వెళ్లారని చెప్పాడు నిందితుడు. అంతేకాదు.. వైశాలి పేరు మీద ఒక వోల్వోకారు, వైశాలి తండ్రికి రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించినట్టు కోర్టుకు తెలిపాడు నవీన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..