Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?

నోరులేని మూగజీవాలపై మనిషిలోని మృగం మేల్కొంటోంది. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన సంచలనంగా మారింది. రోడ్డుపై ఆడుకుంటున్న ఒక చిన్న కుక్కపిల్లపైకి ఏకంగా కారును ఎక్కించి, దాన్ని ప్రాణాలు తీశాడు ఓ వ్యక్తి. ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనుకుంటే పొరపాటే.. కావాలనే ఆ మూగజీవిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?
Car Runs Over Puppy In Saroornagar

Edited By:

Updated on: Jan 10, 2026 | 10:30 PM

హైదరాబాద్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కారు నడుపుతూ కావాలనే ఓ కుక్క పిల్లను తొక్కిన ఘటన నగరంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటన జనవరి 2న సరూర్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో ఈ దారుణం స్పష్టంగా రికార్డవ్వడంతో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ విజువల్స్‌లో ఐదు కుక్క పిల్లలు రోడ్డుపై ఉన్న సమయంలో ఓ కారు నెమ్మదిగా వాటి వైపు వచ్చింది. అయితే పక్కకు వెళ్లే అవకాశం ఉన్నా.. ఆ కారు డ్రైవర్ ఒక కుక్క పిల్లను తన కారు చక్రాల కింద నలిపేశాడు. ఈ ఘటనలో ఆ కుక్క పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనను గమనించిన స్థానిక జంతు సంరక్షకురాలు సోనాలి భౌమిక్ వెంటనే స్పందించారు. ఆమె నిందితుడిని నిలదీయగా, తనకు ఆ ప్రాంతంలో కుక్కలు ఉండటం ఇష్టం లేదని అతడు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సంభాషణ కూడా రికార్డింగ్‌లో ఉందని సమాచారం.

ఈ ఘటనపై సోనాలి భౌమిక్ ఫిర్యాదు చేయగా, జంతు హక్కుల సంస్థ పీఈటీఏ ఇండియా సహకారంతో సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు నిందితుడిగా శ్రావణ్ అనే వ్యక్తిని గుర్తించారు. అతనిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయకు మూగ జీవాలపై ఇలాంటి క్రూరత్వాన్ని సహించబోమని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ ఆధారాలతో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారంలో చట్టపరంగా గట్టి చర్యలు తీసుకునే అవకాశముంది. నగరంలో పెరుగుతున్న జంతువులపై హింసా ఘటనల నేపథ్యంలో ఇలాంటి చర్యలపై కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.