TRS Party Letters: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు కూడగట్టుకోడానికి గులాబీ సేన కొత్తమార్గాన్ని ఎంచుకుంది. ప్రచారానికి గులాబీ కలర్ అద్దుతూ ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్న హుజూరాబాద్ వాసులకు లేఖలు రాస్తుంది. టీఆర్ఎస్ పాలనను వివరిస్తూ.. సర్కార్ అమలు చేస్తున్న పథకాలు, వాటి నుంచి లబ్దిపొందుతున్న వారి గణాంకాలను పొందుపొరుస్తూ.. ఓటర్లు ఆలోంచించి ప్రభుత్వానికి ఓటు రూపంలో మద్దతు తెలపాలని లేఖలు ద్వారా కోరుతోంది. ఇదే సారంశంతో.. ఇప్పటివరకు నియోజకవర్గంలో పలు పథకాలతో లబ్ధి పొందిన వారికి.. నాయకులు లేఖలు రాస్తున్నారు.
ఈటెల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నాటి నుంచి టీఆర్ఎస్ హుజూరాబాద్‌పై దృష్టిసారించింది. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే ప్రముఖ నాయకులు, పలు శాఖల ద్వారా వివిధ పథకాలతో లబ్ధిపొందుతున్న వారికి స్వయంగా లేఖలు రాస్తున్నారు. రైతుబంధు, వికలాంగుల పింఛన్లు, తదితర పథకాల ఆధారంగా లబ్ది పొందుతున్న వారికి కేసీఆర్ పాలన, అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అండగా ఉండాలని.. కారు గుర్తుకే ఓటు వెయ్యాలంటూ ఉత్తరాలు రాస్తున్నారు.
కాగా.. హుజూరాబాద్ నియోజవర్గంలో.. రైతు బంధు ద్వారా 62 వేల పైచిలుకు లబ్ధిదారులున్నారు. దీంతోపాటు ఆసరా పింఛన్‌దారులు 34వేలు, కల్యాణలక్ష్మి 6761, షాది ముబారక్ లబ్ధిదారులు, కేసీఆర్ కిట్ ద్వారా 8197 మంది, గొర్రెల పంపిణీ ద్వారా 5811 మంది, బర్రెల పంపిణీ ద్వారా 1086, చేనేత పథకం కింద 2254 మంది లబ్ధిదారులున్నారు. అయితే.. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ లబ్ధిదారులందరికీ.. టీఆర్ఎస్ నాయకులు లేఖలు రాస్తూ.. ఓటరుమహాశయులను ప్రసన్నం చేసుకుంటున్నారు.
అయితే.. సాధారణంగా ఏ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వం అయినా ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు తాము చేసిన అభివృద్ధిని నోటి ద్వారా ప్రచారం చేయడం కానీ.. పాంప్లేట్స్ పంచడం కానీ చేస్తూ వస్తారు. కానీ ఇప్పుడు టీఆరఎస్ పార్టీ సరికొత్తగా పోస్టల్ లేఖలు పంపి.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: