HUZURABAD BY-ELECTION: ఈటలపై పోటీకి రంకెలేస్తున్న పలువురు నేతలు.. దశాబ్ధంపైగా ఎదురుచూపులకు ఇదే తెర!

|

May 29, 2021 | 5:21 PM

ఈటల రాజేందర్ ఇంకా టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికే రాలేదు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయలేదు. తనకు పొగబెట్టిన టీఆర్ఎస్ పార్టీని వీడి కనీసం వేరే పార్టీలోను ఇంకా చేరనేలేదు. కానీ అప్పడే ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న...

HUZURABAD BY-ELECTION: ఈటలపై పోటీకి రంకెలేస్తున్న పలువురు నేతలు.. దశాబ్ధంపైగా ఎదురుచూపులకు ఇదే తెర!
Kcr And Etela Rajendra
Follow us on

HUZURABAD BY-ELECTION MANY IN RACE: ఈటల రాజేందర్ ఇంకా టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికే రాలేదు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయలేదు. తనకు పొగబెట్టిన టీఆర్ఎస్ పార్టీని వీడి కనీసం వేరే పార్టీలోను ఇంకా చేరనేలేదు. కానీ అప్పడే ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేసినట్లు.. ఆ ఉప ఎన్నిక బరిలో తామే దిగుతామని రంకెలేస్తున్నారు పలువురు రాజకీయ నేతలు. ఈ నేతల్లో దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు చెందిన వారూ వుండడం విశేషం. ఈటలపై పోటీ చేసేందుకు తమకంటే తమకు అవకాశం ఇవ్వాలని తమ తమ పార్టీల అధినేతలకు విన్నవించుకోవడం అప్పుడే ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈటల రాజేందర్ మే నెల మొదటి వారంలో కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సంగతి తెలిసిందే. ఆయనపై రెండు, ఆయన కుమారుడు నితిన్‌పై ఒకటి భూ కబ్జా ఆరోపణలు రాగా.. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈనేపథ్యంలో ఈటల టీఆర్ఎస్ నుంచి బయటికి రావడం ఖాయమైంది. అయితే.. ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే వుంది. గులాబీ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి… ఇండిపెండెంటుగా పోటీ చేసి.. కేసీఆర్ వ్యతిరేకులందరి మద్దతుతో మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాలని తొలుత ఈటల భావించారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇండిపెండెంటుగా పోటీ చేస్తే.. మద్దతు ఇవ్వలేమని, జాతీయ పార్టీలుగా తాము ఉప ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తుందని స్పష్టం చేశాయి. దాంతో రెండు పార్టీల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అగత్యం ఈటలకు వచ్చిపడింది.

అదేసమయంలో తమ తమ పార్టీల్లో చేరాలని కాంగ్రెస్, బీజేపీలు ఈటల వద్దకు రాయభారాలు పంపడం మొదలుపెట్టాయి. టీపీసీసీ తరపున వర్కింగ్ ప్రెసిడెంటు మల్లు భట్టివిక్రమార్క స్వయంగా ఈటల ఫామ్ హౌజ్‌కు వెళ్ళి కలిసి.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత కమలనాథులు రంగంలోకి దిగారు. ఈటలను కేసీఆర్ కేసులతో వేధించడం కన్‌ఫర్మ్ అని.. ఎక్కడా అధికారంలోని కాంగ్రెస్ పార్టీ కంటే కేంద్రంలో అధికారంలో వున్న తమ పార్టీలో చేరితే తప్పకుండా రక్షణ కల్పిస్తామని, తగిన పదవితో గౌరవిస్తామని బీజేపీ నేతలు ఈటలను కన్విన్స్ చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పిన.. ఈటల తన వ్యాపారాలు ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు బీజేపీ అధినాయకత్వం మద్దతు అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని అనుకున్నట్లు సాగితే.. జూన్ రెండో తేదీనగానీ.. ఆ తర్వాత మంచి ముహూర్తానగానీ ఈటల హస్తిన వేదికగా కాషాయతీర్థం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా వుండగా… ఈటల రాజీనామా ద్వారా వచ్చే హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు పలువురు టీఆర్ఎస్ నేతలు సిద్దమవుతున్నారు. ఈటలపై పోటీ చేసే ఛాన్స్ తమకంటే తమకివ్వాలని కోరుతున్నారు. వీరిలో 2009, 2010, 2014లలో ఈటలపై కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన వకులాభరణం కృష్ణమోహన్ రావు కూడా వున్నారు. హాట్‌ టాపిక్‌గా మారిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలోకి వెళ్లడం ఖాయమైనట్టు తేలడంతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్‌ అయ్యాయి. హుజూరాబాద్‌ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ ఏకచ్ఛత్రాధిపత్యం చలాయించారు. ఈ నియోజకవర్గంలో ఆయన స్థాయిలో పార్టీ నాయకులెవరూ ఎదిగే అవకాశం రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల బీజేపీలోకి వెళితే.. ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఉప ఎన్నిక జరిగితే ఈటల రాజేందర్‌ను ఢీకొనే స్థాయి నాయకుడిని బరిలో దింపాల్సిన అవసరం టీఆర్ఎస్ ముందుంటుంది. 2004లో కమలాపూర్‌ నుంచి, 2009 తరువాత హుజూరాబాద్‌ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఈటలకు ప్రతి గ్రామంతో దగ్గరి సంబంధాలున్నాయి. పార్టీ కేడర్‌తో సంబంధం లేకుండా వ్యక్తిగత పరిచయాలు కూడా ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఈటలను ఢీకొనే స్థాయి నాయకుడు ఎవరా అని హుజూరాబాద్‌తోపాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకుల కన్నా ఎక్కువగా.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

2004 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ, ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వని ఈటల రాజేందర్‌ పార్టీ మారి బీజేపీలో చేరితే.. టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశాలు న్నాయి. గతంలో హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసిన నాయకులే.. పార్టీ మారి బరిలో నిలిచేందుకు ముందు వరుసలో ఉండడం విశేషం. ఈ క్రమంలో 2004, 2009, 2018లలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో చాలా కాలం టీడీపీలో కొనసాగిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వీరిలో ప్రధాన నేతగా కనిపిస్తున్నారు. ఈయన ప్రస్తుతం బీజేపీలో వున్నారు. 2004 దాకా పెద్దిరెడ్డి హుజురాబాద్‌లో తిరుగులేని నాయకుడు. తెలంగాణ ఉద్యమం ఎలా ఉధృతమవుతూ వచ్చిందో.. పెద్దిరెడ్డి ప్రాభవం అలా తగ్గుతూ వచ్చింది. కేసీఆర్‌తో పొసగలేమన్న కారణంగా ఆయన ఇప్పటి దాకా టీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. గతంలో తుమ్మల నాగేశ్వర్ రావు, మండవ వెంకటేశ్వర రావు లాంటి వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నప్పుడు పెద్దిరెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన చేరలేదు. తాజాగా తనను కనీసం సంప్రదించకుండా ఈటలను బీజేపీలోకి ఆహ్వానించడంపై గుర్రుగా వున్న పెద్దిరెడ్డి ఈటల ఇటు బీజేపీలో చేరగానే తాను అటు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. అందువల్లనే ఆయన తన ముఖ్య అనుచరులను గులాబీ పార్టీలోకి పంపిస్తున్నారని జిల్లా వర్గాలంటున్నాయి.

1994, 1999లో హుజూరాబాద్‌ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన పెద్దిరెడ్డి 2004లో కెప్టెన్‌ లక్ష్మికాంతరావు చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యంలో చేరి హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా రామగుండం నుంచి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో 2019లో ఆయన బీజేపీలో చేరారు. 2023 ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తూ వచ్చారు. అయితే.. ఈటల బీజేపీలో చేరతారనే ప్రచారంపై పెద్దిరెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తనను సంప్రదించకుండా ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటల బీజేపీలో చేరిన పక్షంలో పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఖాయమనే తెలుస్తోంది.హుజూరాబాద్‌కు చెందిన పెద్దిరెడ్డి అనుయాయుడు పోరెడ్డి శంతన్‌ రెడ్డితోపాటు ఇద్దరు కౌన్సిలర్లు శోభ, మంజుల మే 28న టీఆర్‌ఎస్‌లో చేరడం ఈ అనుమానాల కు తావిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌తో పెద్దిరెడ్డికి ఉన్న సంబంధాలు కూడా ఆయనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వున్న నియోజకవర్గం ఇంఛార్జీ కౌశిక్ రెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకుని ఈటలపై పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడాన్ని కౌశిక్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ కొందరు నేతలు ఈటలను అనుకూలంగా మాట్లాడడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లనే తనకు హుజురాబాద్ టిక్కెట్ ఇస్తామంటే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమన్న సంకేతాలను గులాబీ నేతలకు కౌశిక్ పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువు అయిన కౌశిక్ కాంగ్రెస్ పార్టీని వీడరు అని కూడా కొందరంటున్నారు.

ఇక ఆల్‌రెడీ టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకులాభరణం కృష్ణమోహన్ రావు.. ఈ అవకాశాన్ని అనుకూలంగా మలచుకునేందుకు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. తాను బీసీని కావడం ఈటలపై పోటీ చేస్తే కలిసి వస్తుందని ఆయన గులాబీ దళపతి కేసీఆర్ చెవిన వేసేందుకు పలువురిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అ భ్యర్థి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా వకులాభరణం కృష్ణమోహన్‌ రావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి మరోసారి ఓడిపోయారు. 2014 వరకు కాంగ్రెస్‌లోనే బీసీ కమిషన్‌ సభ్యుడిగా కొనసాగారు. 2014లో ఆయనకు కాంగ్రెస్‌ టికెట్టు దక్కలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీ బీసీ నాయకుడిగా కొనసాగుతున్నారు. తా జా రాజకీయ పరిణామాల దృష్ట్యా టీఆర్‌ఎస్‌ టి క్కెట్టును ఆశిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆ యన ఈటల ఎపిసోడ్‌ వెలుగు చూసిన నాటి నుంచి నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరిస్తున్నా రు. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ముగ్గురితోపాటు కేసీఆర్‌కు అత్యంత సన్నిహిత నేత, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు బంధువుల్లో కొందరు హుజురాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ వరంగల్ పర్యటనకు వెళ్ళినపుడు కెప్టెన్‌తో హుజురాబాద్ విషయంపై రహస్య సమాలోచనలు జరిగినట్లు గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా చర్చల్లో నానుతోంది.

ALSO READ: మరోసారి ఐసోలేషన్ సెంటర్లుగా స్టార్ హోటళ్ళు.. హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి

ALSO READ: ప్రధాన మంత్రి మెడకు బ్రేక్‌ఫాస్ట్ బిల్లు ఉచ్చు.. నిధుల దుర్వినియోగమంటూ పోలీసుల విచారణ షురూ!