Telangana: బాసర ట్రిపుల్ ఐటీ ని పరిశీలించిన ఉన్నతాధికారులు.. సమస్యల పరిష్కారానికి హామీ
బాసర ట్రిపుల్ ఐటీలో (Basra IIIT) విద్యార్థులు నిర్వహించిన ఆందోళనతో అధికారుల్లో కదలిక వచ్చింది. తాజాగా ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థుల డిమాండ్లపై చర్చించారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి...
బాసర ట్రిపుల్ ఐటీలో (Basra IIIT) విద్యార్థులు నిర్వహించిన ఆందోళనతో అధికారుల్లో కదలిక వచ్చింది. తాజాగా ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థుల డిమాండ్లపై చర్చించారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి నిధులు విడుదల చేశారు. విద్యార్థుల ముఖ్యమైన డిమాండ్లను 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీని ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకటరమణ సందర్శించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్ తో కలిసి విద్యార్థులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన, ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి రూ.11 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలోనే వీసీ నియామకం చేపడతామని వెంకటరమణ విద్యార్థులకు హామీ ఇచ్చారు. దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ లైబ్రరీ, నూతన మెస్, ప్లంబింగ్ పనుల్లో పురోగతి కలిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 1400 నూతన ల్యాప్‌టాప్‌లు, 30 లక్షల విలువైన పుస్తకాలకు టెండర్లు పిలిచామని ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకటరమణ వివరించారు.
అయితే.. లెక్చరర్ల నియామకం, ఏఓ, డీఓ, ఫైనాన్స్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను 15 రోజుల్లో పూర్తి చేస్తామని వెంకటరమణ చెప్పారు. 15 రోజుల్లో మరోసారి ట్రిపుల్ ఐటీకి వస్తామని పేర్కొన్నారు. కాగా.. బాసర ట్రిపుల్ ఐటీలో వారం రోజులకు పైగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విపక్షాల నేతలు కూడా అక్కడికి వెళ్లి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. దీంతో విద్యార్థుల డిమాండ్లపై ఉన్నతాధికారులు స్పందించారు.