తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కీలకమైనది ధరణి పోర్టల్ రద్దు. దీనిపై అనేక అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు మొట్టమొదటి సారి ధరణి పోర్టల్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. దీని కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటూ ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
తాము అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ వల్ల 50 ఏళ్ల క్రితం భూమి అమ్ముకొని విదేశాలకు వెళ్లిపోయిన వారి పేర్లు కూడా రికార్డుల్లోకి వచ్చాయన్నారు. అందుకే కబ్జాలు పెరిగిపోయాయని తీవ్రంగా ఆరోపించారు. రేవంత్ రెడ్డితో పాటూ కాంగ్రెస్ నేతలంతా ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తమకు ఒక అవకాశం ఇవ్వండి.. కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ను రద్దు చేసి కొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు మధ్యాహ్నం రివ్యూ మీటింగ్ జరగనుంది. ధరణి పోర్టల్ వల్ల ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది.. ఎప్పుడు రిజిస్టర్ అయింది.. అన్న పూర్తి వివరాలు సింగిల్ క్లిక్‌తో బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి రద్దు చేస్తే రైతు బంధు ఆగిపోతుందని గత పాలకులు చెబితే.. అసలు ధరణికి రైతుబంధుకు సంబంధం లేదని బదులిచ్చారు రేవంత్.
ధరణి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో లేదని.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనే దళారి కంపెనీ చేతిలో ఉంది అన్నారు. ఇలాంటి బలమైన ఆరోపణ, ప్రతి ఆరోపణల నడుమ ప్రచారం సాగిన వేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షలు జరిపి ఏవిధమైన చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..