AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలంగాణలో రాబోయే 3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ రిపోర్ట్..

తెలంగాణలో వర్షాలు మరింత ఉధృతం కానున్నాయి. ఉత్తర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Weather Report: తెలంగాణలో రాబోయే 3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ రిపోర్ట్..
Telangana Weather Report
SN Pasha
|

Updated on: Jul 03, 2026 | 4:03 PM

Share

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు మరింత ఉధృతం కానున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతూ ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ప్రాంతాలకు విస్తరించాయి. మరో 4 నుంచి 5 రోజుల్లో అవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.

ఇక వాయువ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం మరింత చురుకుగా మారిందని అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

జూలై 3 (శుక్రవారం): రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

జూలై 4 (శనివారం): ఉత్తర జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

జూలై 5 (ఆదివారం): కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఉత్తర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుంటే వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, రైతులు మరియు ప్రయాణికులు అధికారుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు.

Follow Us