తెలంగాణలో విభిన్నమైన వాతావరణం ఉంది. ఒక రోజు ఎండ బాగా కాస్తే.. మరో రోజు వర్షం దంచికొడుతోంది. ఏది ఏమైనా ప్రజలకు మాత్రం ఎండల నుంచి ఉపశమనం దక్కింది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడులో ద్రోణి ఏర్పడి అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని.. ముఖ్యంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని అంచనా వేశారు. శుక్రవారం నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, అసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందే అంచనా వేసి.. వాతావరణ శాఖ అలెర్ట్ ఇస్తుందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.