కామారెడ్డిలో కుంభవృష్టి బీభత్సం.. జలదిగ్బంధంలో జనాలు! కొట్టుకుపోయిన కార్లు..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కామారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్‌ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ..

కామారెడ్డిలో కుంభవృష్టి బీభత్సం.. జలదిగ్బంధంలో జనాలు! కొట్టుకుపోయిన కార్లు..
Kamareddy And Medak Floods

Updated on: Aug 28, 2025 | 7:51 AM

కామారెడ్డి, ఆగస్ట్ 28: కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్‌ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ వర్షాపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాలనీలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద నీరుపోటెత్తింది. దీంతో కాలు తీసి బయటపెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. కాగా వర్షాల నేపథ్యంలో వరద ఉధృతితో జాతీయ రహదారిని 44 తాత్కాలికంగా మూసివేశారు. కామారెడ్డి – భిక్కనూర్‌ మార్గంలో రైలు పట్టాల కింద నుంచి వరద నీరు పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వరద నీటిలో వాహనాలు సైతం కొట్టుకపోయాయి.

మరోవైపు వేల ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో అధికారులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ యూనివర్సిటీలో పరీక్షలను సైతం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డిలో నీట మునిగిన జిఆర్ కాలనీ నుండి ఎన్డిఆర్ ఎఫ్ బృందాలు ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న వాహనదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకురావొద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు. డ్రోన్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారాలు పంపిణీ చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్‌ మంత్రి సీతక్క నేడు పర్యటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.