AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hail Storm: వికారాబాద్‌లో గుట్టలు గుట్టలుగా వడగళ్లు.. ఈ స్థాయిలో ఎందుకు పడ్డాయో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ జామ్‌ల వార్తలు అటు టీవీ ఛానెళ్లలోనూ.. సోషల్ మీడియాలోనూ హోరెత్తి పోయాయి. వీటన్నింటి మధ్య ఓ వార్త.. యావత్ తెలుగు ప్రజల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అదే వికారాబాద్‌లో వడగళ్ల వాన.

Hail Storm: వికారాబాద్‌లో గుట్టలు గుట్టలుగా వడగళ్లు.. ఈ స్థాయిలో ఎందుకు పడ్డాయో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..
Hail Storm In Vikarabad
Basha Shek
|

Updated on: Mar 16, 2023 | 9:14 PM

Share

వేసవి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో ఈ ఏడాది ఎలినినో కారణంగా వర్షాలు తక్కువగా ఉంటాయని.. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ గత కొద్ది రోజులుగా హెచ్చరిస్తూ వస్తోంది. మరోవైపు మూడు-నాలుగు రోజుల క్రితం వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త అందించింది. రాబోయే నాలుుగైదు రోజుల్లో వర్షాలు ఉంటాయని.. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పింది. అన్నట్టుగానే ఇవాళ ఉదయం నుంచే అటూ ఇటూగా తెలంగాణ మొత్తం కారు మబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్ మహానగరంలో గత కొద్ది నెలల్లో ఎన్నడూ చూడని వాతావరణం ఏర్పడింది. ఓ దశలో వాహనదారులు మిట్ట మధ్యాహ్నం లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆపై హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ జామ్‌ల వార్తలు అటు టీవీ ఛానెళ్లలోనూ.. సోషల్ మీడియాలోనూ హోరెత్తి పోయాయి. వీటన్నింటి మధ్య ఓ వార్త.. యావత్ తెలుగు ప్రజల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అదే వికారాబాద్‌లో వడగళ్ల వాన.

గుట్టలు గుట్టలుగా వడగళ్లు..

సాధారణంగా వేసవిలో వడగళ్ల వాన ఎప్పుడూ చూస్తునే ఉంటాం. వడగళ్లు కురవగానే సరదాగా వాటిని ఏరుకోవడం.. చిన్నపిల్లలైతే ఆడుకోవడం.. ఇది మనమూ చేశాం.. ఇప్పుడు మన పిల్లలూ చేస్తున్నారు. కానీ ఇవాళ వికారబాద్‌లో కురిసిన వడగళ్ల వాన మాత్రం అలాంటిలాంటిది కాదు.. ఒక్కసారిగా మన వికారాబాద్‌లోనే ఉన్నామా.. లేదా.. ఏ కశ్మీర్లోనో.. సిమ్లాలోనో ఉన్నామా అన్నట్టు కనిపించింది. ఎటు చూసినా వడగళ్లే.. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినట్టు కనిపించాయి. హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న వికారాబాద్‌ ఇలా సిమ్లాలా.. కశ్మీర్లా ఎలా మారిందంటూ సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ… ఆ వడగళ్ల వాన విజువల్స్‌ను షేర్ చేస్తూ.. చూడండి.. ఇది మన వికారాబాదే అంటూ కామెంట్లు.. ఇంకొందరైతే వడగళ్లన్నింటినీ గుట్టలుగా పోసి.. కూరగాయలు అమ్ముతున్నట్టు అమ్మకాలు కూడా మొదలు పెట్టేశారు. మొత్తంగా ఈ వికారాబాద్ వడగళ్ల వాన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది

ఇవి కూడా చదవండి

అసలింతకీ ఈ వడగళ్ల వానలు ఎలా పడతాయి.. వికారాబాద్‌లోనే ఈ స్థాయిలో ఎందుకు పడ్డాయి.?

వేసవిలో వడగళ్లు సర్వ సాధారణం. నిజానికి ఏప్రిల్-మే నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ వడగళ్ల వానలు పడుతుంటాయి. కానీ ఈ సారి మార్చిలోనే పలకరించాయి. నిజానికి వేసవిలో భూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఫలితంగా వేడిగాలి పైకి వెళ్తుంది. అదే సమయంలో గాలిలో ఎక్కువగా తేమ చేరడం వల్ల వాతావరణంలో ఒకరకమైన అస్థిరత ఏర్పడుతుంది. ఫలితంగా క్యుబులో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. వీటినే వాతావరణ పరిభాషలో CB మేఘాలు అంటారు. సాధారణంగా భూమి నుంచి ఐదురన్నర కిలోమీటర్ల కన్నా పైకి వెళ్లిన తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తాయి. అయితే ఈ క్యుబులో నింబస్ మేఘాలు 15 కిలోమీటర్ల వరకు పైకి వెళ్లే అవకాశం ఉంది. ఫలితంగా అక్కడ టెంపరేచర్స్ మైనస్ డిగ్రీల్లో ఉంటుంది. ఫలితంగా ఈ మేఘాల్లోని నీటి బిందువులు గడ్డకట్టేస్తాయి. అవే వడగళ్ల రూపంలో నేలపైకి వస్తాయి. ఇక వికారాబాద్‌, నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఇదే పరిస్థితి నెలకొందని, అందుకే ఆ స్థాయిలో అక్కడ వడగళ్లు పడ్డాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పరిస్థితి మరో 2 రోజులు ఉంటుందన్నది కూడా వాతావరణ శాఖ చెబుతున్న మాట.

క్రికెట్‌ బాల్‌ సైజ్‌లో కూడా..

సాధారణంగా వడగండ్ల సైజు ఒక మిల్లీ మీటర్ నుంచి 40 మిల్లీ మీటర్ల వరకు ఉంటాయి. అంటే మనం చూసే చిన్న చిన్న ఐసు గడ్డల నుంచి టెన్నిస్ బాల్ సైజు.. ఒక్కో సారి అంతకన్నా ఎక్కువ సైజులో కూడా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా కురిసే వడగండ్ల వాన కారణంగా తరచు పంట నష్టం, ఆస్తి నష్టంజరుగుతుంటుంది. ప్రాణ నష్టం చాలా అరుదుగా మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాటి పరిమాణం 1 నుంచి 30 మిల్లీ మీటర్ల మధ్యలోనే ఉంటాయి. కానీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఒక్కోసారి టేబుల్ టెన్నిస్ బాల్ సైజు నుంచి లాన్ టెన్నిస్ బాల్ స్థాయిలో కూడా వడగళ్లు కురుస్తుంటాయి. 1986 బంగ్లాదేశ్‌లోని గోపాల్ గంజ్ జిల్లాలో ఏకంగా సుమారు కేజీ బరువు గల వడగళ్లు కురిసాయి. వాటి ధాటికి 40 మంది ప్రాణాలు కోల్పోగా మరో 400 మంది గాయపడ్డారు. అయితే ఆ తర్వాత అందిన రిపోర్టుల ప్రకారం మరణించిన వారి సంఖ్య 92 చేరింది. 1888 ఏప్రిల్ 30న ఉత్తర ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో ఏకంగా బాతుగుడ్లు, క్రికెట్ బాల్ సైజులో వడగండ్లు కురిశాయి. ఆ ధాటికి 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే వడగండ్ల కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించిన ఘటన ఇదేనని 2017 మే నెలలో వరల్డ్ మెటియొరొలాజికల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.

విమానాలకు నష్టమే?

వడగండ్ల వర్షాల వల్ల విమానాలకు ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది. 2006 జూన్ 9న దక్షిణ కొరియాకు చెందిన ఎయిర్ బస్ 321 ఎయిర్ లైనర్‌ వడగండ్ల ధాటికి రెక్కల చివర్లు దెబ్బతిన్నాయి. రాడార్‌కు రక్షణ కవచంగా ఉండే రోడోమ్‌ కూడా దెబ్బతింది. ఆ తర్వాత అతి కష్టమ్మీద ఎలాగోలా సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు సిబ్బంది. 2017-2019 మధ్య కాలంలో మొత్తం 20 సంఘటనలు నమోదయ్యాయి. సాధారణంగా విమానం విండ్ స్క్రీన్స్ పక్షుల దాడుల్ని, వండగండ్ల తాకిడిని కూడా తట్టుకునేలా ఉంటాయి. కానీ దక్షిణ కొరియా విమానం విషయంలో మాత్రం వడగండ్ల తాకిడికి విండ్ స్క్రీన్స్ అస్పష్టంగా తయారై ల్యాండింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక నేలపై ఉండే సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్స్‌కు కూడా వడగళ్ల నష్టం చేకూరుస్తాయి.

-రవికుమార్, TV9

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..