Harish Rao: స్వార్థపరులే పార్టీలు మారుతున్నారు.. వారిని ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారు: హరీశ్ రావు
పార్లమెంట్ ఎన్నికల ముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సభలు, సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో గెలుపు వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నారు. ఇవాళ ఆయన భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సభలు, సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో గెలుపు వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నారు. ఇవాళ ఆయన భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని అధికారంలోని ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
2014లో పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్ఫూర్తితో.. ఈ 2024లోనూ గెలిపించాలని, నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో గెలుస్తామని కార్యకర్తల్లో ధైర్యం నింపారు హరీశ్. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందని, ఆ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డి, పట్నం సునీతలు పార్టీ మారడాన్ని ప్రజలు హర్షించడం లేదు అని, స్వార్థపరులే పార్టీలు మారుతున్నారు. వారిని ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారని జంపింగ్ నేతలనుద్దేశించి మాజీ మంత్రి విరుచుకుపడ్డారు.
భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ బలహీన వర్గాల నేత అని, ఎన్నోఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఆయనను పార్లమెంటుకు పంపాలని హరీశ్ రావు అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి.. రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరింపబడిన వ్యక్తి అని, అతనితో జాగ్రత్తగా ఉండాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ నేతలు వందరోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పాలనకు వందరోజులు నిండాకే కోడ్ అమల్లోకి వచ్చిందని హరీశ్ రావు అన్నారు.
ఆరు గ్యారంటీల్లో తొలి హామీ మహిళలకు 2500లనే అమలు చేయలేదని, 2 లక్షల రుణమాఫీ, వడ్లకు 500 బోనస్, 4 వేల ఫింఛన్, 15 వేల రైతుబంధు, తులం బంగారం, 4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు 5 లక్షల బ్యాంకు కార్డు, వీటిలో ఒక్క హామీ కూడా అమలు కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.