
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ కల్లుగీత కార్మికుడిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. కల్లు సేకరించే మండువాలోనే రక్తపు మడుగులో పడి విజయ్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్కతుర్తికి చెందిన విజయ్ కళ్యాణ్ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో.. అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. పలుమార్లు పొడవడంతో విజయ్ తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ మార్గమధ్యలోనే విజయ్ కళ్యాణ్ మృతి చెందాడు.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అఖిల్ కమలాపూర్ సబ్ స్టేషన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అఖిల్ భార్యతో విజయ్ కళ్యాణ్‌కు ఉన్న వివాహేతర సంబంధమే ఈ గొడవకు కారణమని సమాచారం. సుమారు నెల రోజుల క్రితమే తన భార్యతో సన్నిహితంగా ఉండవద్దని అఖిల్.. విజయ్‌ను తీవ్రంగా హెచ్చరించాడు. అఖిల్ హెచ్చరికలను లెక్కచేయని విజయ్, తన ప్రవర్తన మార్చుకోకపోగా మరింత భరితెగించినట్లు తెలుస్తోంది. తన కాపురంలో విజయ్ చిచ్చు పెడుతున్నాడనే కోపంతో అఖిల్ రగిలిపోయాడు. విజయ్ నిత్యం ఎక్కడ ఉంటాడో గమనించి, పక్కా స్కెచ్‌తో కల్లు మండువా వద్దే అంతమొందించాడు.
విజయ్ కళ్యాణ్ ప్రవర్తనపై స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అఖిల్ తన కాపురాన్ని చక్కదిద్దుకునేందుకు విజయ్‌కు చాలాసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడని, కానీ విజయ్ వినకపోవడంతోనే విసిగిపోయి అఖిల్ ఈ దారుణానికి ఒడిగట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు. హత్య అనంతరం నిందితుడు అఖిల్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే కల్లు మండువా వద్ద ఇలాంటి హత్య జరగడంతో మండల కేంద్రంలో భయాందోళనలు నెలకొన్నాయి.