ఖమ్మం, ఆగస్టు 18: తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన మిడిదొడ్డి మనీష.. వారి కష్టానికి ప్రతిఫలం చూపించాలని, తాను ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంది. అదే పట్టుదలతో ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మిడిదొడ్డి రాజయ్య–ఆండాళు దంపతులు 20 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లా నార్కేట్‌పల్లి మండలం అమనబోలు గ్రామం నుండి ఖమ్మం నగరానికి వచ్చారు. ఖమ్మంలోనే కూలీ పనులు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తున్నారు.. వీరికి ఒక కుమార్తె మనీష, కుమారుడు ఉపేందర్‌లు ఉన్నారు.
మనీష, ఉపేందర్‌లను చదివించేందుకు రాజయ్య నగరంలోని గాంధీచౌక్‌లో హమాలీ పని చేస్తుండగా.. ఆండాళు వివాహ శుభకార్యాల్లో పనులు, ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. అయితే తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన మనీష చిన్ననాటి నుండే చదువుపై ఆసక్తి పెంచుకుంది. 10వ తరగతి వరకు నగరంలో చదివిన మనీష ఇంటర్ టీఎస్‌ఆర్‌జేసీ వరంగల్‌లో, డిగ్రీ కోటి ఉమెన్స్ కళాశాలలో పూర్తి చేసింది. 2020 ఏడాదిలో డిగ్రీ పూర్తవుతుండగానే ఎస్ ఐ ఉద్యోగం సాధించాలని హైదరాబాద్‌లో శిక్షణ పొందింది. 2022 ఎస్ ఐ ఉద్యోగానికి పరీక్ష రాసిన మనీష ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎస్ ఐ ఉద్యోగానికి ఎంపికైంది.
ఈ క్రమంలో మనీష మాట్లాడుతూ.. ‘తల్లి దండ్రుల కష్టం చూసి.. ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంతో చదివాను. అమ్మ, నాన్న కష్టాన్ని దగ్గరగా చూశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారి శ్రమకు ఫలితం చూపించాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. ఇంకా‘డిగ్రీ పూర్తి చేసే సమయంలో ఎస్ ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని ఇతరులు చెప్పడంతో శిక్షణ తీసుకున్నాను. నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసి పరీక్ష రాశాను. ఉద్యోగం రావడం పట్ల నేను, కుటుంబ సభ్యులకు చాలా సంతోషంగా ఉంది’ అని మనీస తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..