భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఇల్లెందు- మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఇల్లెందు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొకరి పరిస్థతి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మహబూబాబాద్ వైపు నుంచి ఇల్లెందు వెళుతోన్న టీఎస్03ఎఫ్ సీ 9075 నంబరుగల కారు ను.. ఇల్లెందు నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న ఏపీ16టీజీ3859 నంబరు గల బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఇల్లెందు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించగా.. ఒకరు చికిత్సపొందుతూ మృతిచెందారు.
మృతుల్లో ఇద్దరు వరంగల్ జిల్లా కేంద్రం బట్టలబజారుకు చెందిన ఫొటోస్టూడియో యజమాని బైరి రాము, వరంగల్ నగరానికి చెందిన బాసబత్తిని అరవింద్‌గా గుర్తించగా.. మరో ఇద్దరు కూడా వరంగల్ జిల్లాకు చెందిన రిషీ, కళ్యాణ్‌గా గుర్తించారు. మృతులంతా 30 నుంచి 35 ఏళ్లలోపు వారేనని తెలుస్తోంది. వీరంతా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఫొటో షూట్‌కు అనువైన లొకేషన్ల గుర్తింపు కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..