Telangana: అయ్యో దేవుడా.. ఫారిన్‌లో చదివింది.. ఇంటికొచ్చాక ఎవరూ ఊహించని విధంగా..

విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసుకుని కేవలం మూడు నెలల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చిన యశోక.. అప్పటినుండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. పలు సంస్థలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఉద్యోగం లభించకపోవడం లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఎవరూ ఊహించని విధంగా కఠిన నిర్ణయం తీసుకుంది..

Telangana: అయ్యో దేవుడా.. ఫారిన్‌లో చదివింది.. ఇంటికొచ్చాక ఎవరూ ఊహించని విధంగా..
Foreign Educated Young Woman Dies

Edited By: Krishna S

Updated on: Oct 02, 2025 | 12:54 PM

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి మూడు నెలల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌లోని బండారు యశోక అనే యువతి తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యశోక విదేశాల్లో తన చదువును పూర్తి చేసుకుని సుమారు మూడు నెలల క్రితం తన సొంత గ్రామానికి చేరుకుంది. అప్పటినుండి ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు సంస్థల్లో ఉద్యోగాలకు అప్లై చేసింది. అయితే ఇంతలోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

యశోక ఆత్మహత్యకు గల కారణాలపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం లభించకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఇంకేమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కుటుంబ సభ్యులు తమలో తాము ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది.

యువతి మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను పరిశీలించడం ద్వారా ఆమె ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విదేశాల్లో చదువు పూర్తిచేసుకుని బంగారు భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న యువతి ఇలా అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..