మరో 15 నిమిషాల్లో గమ్యస్థానం చేరుతారనుకునే సమయంలో మృత్యువు కబలించింది. శుభకార్యానికి వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని మింగేసింది. డెత్ స్పాట్ గా పేరున్న మూల మలుపు వద్ద ఒక్కసారి వాహనం డివైడర్లను రాసుకుంటూ వెళ్లి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జాతీయ రహదారి 44 పై చోటు చేసుకుంది. డెత్ స్పాట్ మేకల మండి.. ఈసారి 5 గురిని పొట్టన పెట్టుకుంది.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎన్ హెచ్ 44 పై ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మదర్సాలో మనువడి విద్యాబ్యాసం ముగిసిన శుభసమయంలో బైంసాలో కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుక చేసుకుని ఇంటికి బయలు దేరిన జాహేద్ కుటుంబం మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోగా వేగం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. కుటుంబానికి కుటుంబాన్నే మింగేసింది. ఆదిలాబాద్ జిల్లా టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న
ఇచ్చోడ మండల కేంద్రంలోని బార్కత్ పూర కాలనీకి చెందిన జహేద్ కుటుంబం ఈ రోడ్డు ప్రమాదంలో బలైంది. బైంసా నుండి తిరిగి ఆదిలాబాద్ కు వస్తుండగా అర్థరాత్రి 11:30 సమయంలో గుడిహత్నూర్ మండలం సీత గొంది మేకలగండి వద్ద 44వ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న డీ మాక్స్ వాహనం అదుపుతప్పి సైడ్ పిల్లర్ ను ఢీకొట్టి అంతే వేగంతో పల్టీలో కొట్టి పక్కనే ఉన్న కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 8 మందిలో మోహిజుద్దిన్ ( 60 ) , మోహినుద్దిన్ ( 40 ) , అలీ ( 8 ) , హుస్మానుద్దిన్ ( 10 ) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాల పాలైన
ఫారీద్ ( 12) , అయేషా ( 37 ) , ఇక్వార్ ( 6 ) షాద్ ( 8 ) లను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు.
ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. జహేద్ గతంలో హైదరాబాద్ లో ఉంటూ, రిలయన్స్ కంపెనీ లో ఇంజనీరుగా విధులు నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం బతుకుదెరువు కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి ఎలక్ట్రిక్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఊహించని ప్రమాదంతో కుటుంబాలని ఐదుగురు ప్రాణాలు విడవడంతో విషాదంలో మునిగిపోయారు బందువులు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు రిమ్స్ వైద్యులు తెలిపారు. డెత్ స్పాట్ గా ఉన్న మేకలగండి వద్ద గతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోగా గత ఏడాది ఆదిలాబాద్ కు చెందిన ఓ కుటుంబం కూడా ఇదే మూలమలుపు వద్ద బలైంది. తాజాగా డెత్ స్పాట్ వద్ద ఆదిలాబాద్ కు చెందిన జాహెద్ కుటుంబం సైతం ఐదుగురిని కోల్పోయింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..