Telangana Congess: పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చేనా.. ఆ జిల్లా కంచుకోట కాంగ్రెస్‌లోట్రాయాంగిల్ ఫైట్..

ఆ నియోజకవర్గం ఒకప్పుడు ఆ పార్టీకి పెద్ద కంచుకోట..ఆ నియోజకవర్గం నుండే దేశానికి ప్రధానిని అందజేసిన ఘనత ఆ పార్టీకి దక్కింది..కానీ ఇప్పుడు మాత్రం తీవ్ర వర్గపోరులో మునిగి తేలుతున్నారు ఆ పార్టీ లీడర్లు..ఇంతకీ అది ఏ నియోజకవర్గం..? అసలు ఇదంతా ఏ పార్టీలో..?

Telangana Congess: పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చేనా.. ఆ జిల్లా కంచుకోట కాంగ్రెస్‌లోట్రాయాంగిల్ ఫైట్..
Medak Congress

Updated on: Jun 22, 2023 | 8:25 PM

మెదక్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అడ్డా. అలాంటిచోట ఇంటిపోరు పెనంమీదినుంచి పొయ్యిలో పడినట్లుంది ఆ పార్టీ పరిస్థితి. మెదక్‌ టికెట్‌ కోసం డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పీసీసీ మెంబర్ మ్యాడం బాలకృష్ణ తీవ్రంగా పోటీపడుతున్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపుఇచ్చినా ఎవరి దారి వారిదే అన్నట్లుంది ఇద్దరు నేతల వ్యవహారశైలి. రామాయంపేట డివిజన్ కోసం తిరుపతిరెడ్డి ఓ ప్రోగ్రాం చేస్తే.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని అదే రోజు రైతులతో కలెక్టరేట్‌కి ర్యాలీ నిర్వహించారు బాలకృష్ణ. దీంతో ఎవరితో ఉండాలో తేల్చుకోలేకపోయింది పార్టీ కేడర్‌.

మెదక్‌ నియోజకవర్గంలో ఇద్దరు నేతలమధ్యే కేడర్‌ నలిగిపోతుంటే.. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరటంతో పార్టీలో వర్గపోరు ఓ లెవల్‌కి వెళ్లిందట. శశిధర్‌రెడ్డి చేరికను వ్యతిరేకించిన డీసీసీ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇచ్చేదాకా వెళ్లింది వ్యవహారం. కానీ మ్యాడం బాలకృష్ణ మాత్రం శశిధర్ రెడ్డి రాకని స్వాగతించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శశిధర్‌రెడ్డి రీ ఎంట్రీతో కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికన్న కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. రీఎంట్రీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యేకే టికెట్‌ అన్న ప్రచారం జరిగినా.. ఆరోగ్య కారణాలతో తాను పోటీచేయడం లేదని చెప్పేశారట శశిధర్‌రెడ్డి. దీంతో నేతలిద్దరూ ఊపిరి పీల్చుకున్నా.. ఆయన మద్దతు ఎవరికన్న కొత్త టెన్షన్‌ మొదలైందట.

పార్టీలో తన చేరికను వ్యతిరేకించిన తిరుపతిరెడ్డికి మాజీ ఎమ్మెల్యే మద్దతివ్వకపోవచ్చని పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. తన రాకని స్వాగతించిన బాలకృష్ణకే ఆయన మద్దతు ఉంటుందని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. దీనికితోడు శశిధర్ రెడ్డి ఇప్పటికే రెండు మూడు సార్లు బాలకృష్ణ కార్యాలయానికి వచ్చి వెళ్లడంతో తిరుపతిరెడ్డి వర్గం కొంత ఆందోళనతోనే ఉందంటున్నారు.

అదే సమయంలో శశిధర్‌రెడ్డి ఎవరికి మద్దతిచ్చినా.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆశీస్సులు తమ నాయకుడికేనని చెప్పుకుంటోంది తిరుపతిరెడ్డి వర్గం. అయితే తిరుపతిరెడ్డితో విభేదించి పార్టీ వీడినవారిని గతంలో బాలకృష్ణ నచ్చజెప్పి మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకురావటంతో.. టికెట్‌ విషయంలో ఇవన్నీ ప్రభావం చూపొచ్చన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి కొత్తగా వచ్చిన నాయకుడు తాను రేసులో లేనని చెప్పినా.. మెదక్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు సద్దుమణగలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం