గ్రామంలో వరుస మరణాలు.. భయంతో ఇళ్లు వదిలి అడవి బాట పట్టిన జనాలు.. అసలక్కడేం జరుగుతుంది!

అది మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రాంతమే అయినా.. అక్కడ పల్లె పోకడలు, పాత నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వరుసగా చోటుచేసుకున్న మరణాలు ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఏదో కీడు సోకిందనే భయంతో, పురోహితుడి సూచన మేరకు శతాబ్దాల నాటి ఆచారాన్ని పాటిస్తూ కాలనీవాసులంతా ఊరు విడిచి అడవి బాట పట్టారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

గ్రామంలో వరుస మరణాలు.. భయంతో ఇళ్లు వదిలి అడవి బాట పట్టిన జనాలు.. అసలక్కడేం జరుగుతుంది!
Jammikunta Keedu Vantalu

Edited By:

Updated on: Jul 12, 2026 | 9:33 PM

గ్రామంలో వరుస చావులతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు ఏదో కీడు సోకిందనే భయంతో.. ఊరి విడిచి అడవి బాట పట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలోకి వెళ్తే.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట 13, 14వ వార్డులు పరిధిలో గడిచిన కొద్ది రోజుల్లోనే వివిధ కారణాలతో సుమారు 10 మంది మృతి చెందారు. వరుసగా జరుగుతున్న ఈ చావులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు గ్రామ పెద్దలు స్థానిక పురోహితుడిని సంప్రదించారు. ప్రస్తుత కాలానికి కీడు సోకిందని, దీని నివారణకు ఊరు విడిచి వెళ్లడమే మార్గమని ఆయన సూచించారు.

అయితే పురోహితుడి మాటలను నమ్మిన కాలనీ ప్రజలు.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకే ఇళ్లకు తాళాలు వేసి అడవి బాట పట్టారు. సాంప్రదాయం ప్రకారం ఉదయాన్నే ఇళ్ల ముందు కల్లాపి కూడా చల్లకుండా, పిల్లాపాపలతో కలిసి గ్రామ శివారు ప్రాంతాలకు తరలివెళ్లారు. రోజంతా శివారులోనే వంటలు వండుకుని, అక్కడే గడిపారు. సాయంత్రం చీకటి పడిన తర్వాతే తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ఊరికి పట్టిన కీడు తొలగిపోవాలనే నమ్మకంతోనే తాము ఈ కీడు వంటల కార్యక్రమం చేపట్టామని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో వర్షాలు పడనప్పుడు కూడా ఇలాగే ఊరు విడిచి వెళ్లేవారమని వారు గుర్తు చేసుకున్నారు.

సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడంపై పట్టణవాసులు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరుస మరణాలకు గల అసలైన శాస్త్రీయ లేదా ఆరోగ్య కారణాలను గుర్తించకుండా, ఇలా కీడు వంటల పేరుతో ఊరు విడిచి వెళ్లడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యల వల్లే మరణాలు సంభవించి ఉంటాయని, అధికారులు తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us