AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ చిట్టితల్లి ఏం పాపం చేసింది రా.. ఇద్దరి మధ్య బలైన చిన్నారి..!

భార్యాభర్తలు అన్నాక.. గొడవలు జరగడం సాధారణమే..! కానీ ఒక్కోసారి ఆ గొడవలు శృతిమించుతాయి. ఆవేశంలో ప్రాణాలను కూడా తీసుకుంటారు. కానీ తల్లిదండ్రుల విభేదాలతో అభం శుభం తెలియని చిన్నారి బలి అయ్యింది. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కలచివేసింది

ఆ చిట్టితల్లి ఏం పాపం చేసింది రా.. ఇద్దరి మధ్య బలైన చిన్నారి..!
Father Kills Daughter
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 20, 2025 | 10:41 AM

Share

భార్యాభర్తలు అన్నాక.. గొడవలు జరగడం సాధారణమే..! కానీ ఒక్కోసారి ఆ గొడవలు శృతిమించుతాయి. ఆవేశంలో ప్రాణాలను కూడా తీసుకుంటారు. కానీ తల్లిదండ్రుల విభేదాలతో అభం శుభం తెలియని చిన్నారి బలి అయ్యింది. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. ఆ చిన్నారి చేసిన పాపం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నాగారం మండలం కొత్తపల్లికి చెందిన వెంకటేష్ తో నాగమణికి వివాహమైంది. సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది వయసు ఉన్న కుమార్తె భవిజ్ఞ ఉంది. కొంతకాలం వీరి సంసారం సాఫీగా సాగినా.. ఇటీవల తరచూ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గురువారం (సెప్టెంబర్ 19) రాత్రి వెంకటేష్ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం రాజుకుంది.

ఈ గొడవతో అరుపులు, కేకల శబ్దానికి అక్కడే ఉన్న ఏడాది వయస్సున్న కుమార్తె భవిజ్ఞ తీవ్ర భయంతో ఏడుస్తూ ఉండిపోయింది. పాప ఏడుపు చుట్టుపక్కల వారికి వినిపిస్తుందని కోపోద్రిక్తుడైన ఆ తండ్రి వెంకటేష్.. కూతురు నోరు బలవంతంగా మూసే ప్రయత్నం చేశాడు. దీంతో చిన్నారి ఊపిరాడక తల్లడిల్లిపోయింది. పాప చనిపోతుందని భార్య నాగమణి భర్త చేతిని తొలగించింది. దీంతో కన్న కూతురనే కనీసం కనికరం లేకుండా చిన్నారిని ఆవేశంలో నేలకు విసిరి కొట్టాడు.

తండ్రి సైకో చేష్టలకు ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కూతురు ఉలుకు పలుకు లేకుండా పడిపోవడంతో భార్య నాగమణి ఏడుపులు విని బయటకు వచ్చిన స్థానికులు చిన్నారిని చూసి చలించిపోయారు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పాపను స్థానికుల సహాయంతో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ చిన్నారి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. ఈ దారుణ ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన తండ్రి వెంకటేష్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ పసిప్రాణం కన్న తండ్రి ఆవేశానికి బలైపోవడం అందరి మనసులను కలిచి వేస్తోంది. ఈ విషాదం సమాజంలోని మానవీయ విలువలు ఎటువైపు పయనిస్తున్నాయనే ప్రశ్నను రేకెత్తిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..