AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి దేవతలను పూజిస్తూ.. వాన కోసం వినూత్న ఆచారం..

రైతన్నలు ఎక్కువగా ప్రకృతి దేవతలను పూజిస్తుంటారు. పంటలు సమృద్ధిగా పండాలని కనపడిన దేవుడినల్లా మొక్కుతారు. వర్షాల కోసం వరుణయాగం, శివలింగానికి జలాభిషేకం చేస్తుంటారు. తాజాగా వరుణుడి కటాక్షం కోసం రైతులు వ‌ర‌ద పాశం, కప్పలకు పెళ్లి లాంటి పూజలు చేయడం ఆనవాయితీ. వాన కాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. వరుణుడు ముఖం చాటేశాడు. ఆకాశంలో మేఘాలు రోజు అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తున్నా. చిరుజల్లులు తప్పా చేను పదునయ్యే వాన కురవడం లేదు.

ప్రకృతి దేవతలను పూజిస్తూ.. వాన కోసం వినూత్న ఆచారం..
Nalgonda
Srikar T
|

Updated on: Jul 08, 2024 | 12:58 PM

Share

రైతన్నలు ఎక్కువగా ప్రకృతి దేవతలను పూజిస్తుంటారు. పంటలు సమృద్ధిగా పండాలని కనపడిన దేవుడినల్లా మొక్కుతారు. వర్షాల కోసం వరుణయాగం, శివలింగానికి జలాభిషేకం చేస్తుంటారు. తాజాగా వరుణుడి కటాక్షం కోసం రైతులు వ‌ర‌ద పాశం, కప్పలకు పెళ్లి లాంటి పూజలు చేయడం ఆనవాయితీ. వాన కాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. వరుణుడు ముఖం చాటేశాడు. ఆకాశంలో మేఘాలు రోజు అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తున్నా. చిరుజల్లులు తప్పా చేను పదునయ్యే వాన కురవడం లేదు. ఇప్పటివరకు వ్యవసాయానికి సరిపడా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తూన్నారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో వర్షపాతం నమోదు కాకపోవడం అన్నదాతల్లో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్ధకంగా మారింది.

వరద పాశం.. పాటలు.. సహా పంక్తి భోజనాలు..

వ‌రుణ దేవా, క‌రుణించావా.. అంటూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతన్నలు దేవుళ్ల‌ను ఆరాధిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నశింపేట గ్రామంలో గ్రామస్థులందరూ వరుణుడి కరుణ కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి గంగమ్మ గుడి వద్ద వరద పాశం చేశారు. ముందుగా గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి బియ్యం సేకరించి గ్రామ దేవతలందరికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సేకరించిన బియ్యంలో బెల్లం, పాలు, కొబ్బరి కలిపి పాయసం చేశారు. గ్రామంలోని ప్రతి గడప నుండి బిందె నీళ్ళతో గ్రామ చెరువు వద్దగల కట్ట మైసమ్మ అమ్మవారికి జలాభిషేకం చేశారు. తొమ్మిది మంది బాలురుతో పూజలు చేయించి.. పూజించిన బండపై పాయసం పోశారు. బండపై పోసిన పాయసాన్ని చేతితో తాకకుండా నాకించి వచ్చిన వారంతా ప్రసాదం స్వీకరించారు. ఆలయ ఆవరణలో మహిళలంతా గ్రామ దేవుళ్ళని కీర్తిస్తూ వర్షాలు కురిపించి పాడి పంట సమృద్ధిగా కలిగేలా దీవించాలని చప్పట్లతో పాటలు పాడారు. ఇలా చేస్తే దేవతలు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తారని నమ్మకం అని అనాదిగా తమ పూర్వీకులు ఇలాంటి ఆచారాన్ని పాటించే వారని గ్రామస్థులు తెలిపారు. పూజా కార్యక్రమాల తర్వాత గ్రామస్తులంతా సహపంక్తి భోజనం చేసి వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు.

వరుణుడి కటాక్షం కోసం కప్పలకు పెళ్లి..

నల్లగొండ జిల్లా కనగల్ మండలం కుమ్మరిగూడెంలో వర్షాలు కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ గ్రామస్తులు కప్పలకు పెళ్లి చేశారు. ముందుగా గ్రామంలో రోకలికి వేపాకులు కట్టి, ఆ రోకలికి జోలెలో రెండు కప్పలను కట్టి ఉంచారు. మహిళలు ఇంటింటికీ తిరుగుతూ వర్షాలు కురవాలని కప్ప తల్లిపై నీళ్లు పోస్తూ వరుణ దేవుడిని వేడుకున్నారు. కప్పతల్లి ఆట ఆడుతూ పాటలు పాడుతూ భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా మహిళలు చిన్నారులపై బిందెలతో నీళ్లు పోశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తాము సిరులు పండించుకునేలా చూడాలని వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..