Farmers – Crop loss – Gulab Cyclone: గులాబ్ తుఫాన్ రైతుల గుండెల్లో గునపాలు దించింది. వానాకాలం పోతూపోతూ అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన కుంభవృష్టితో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంటలు వరద నీటిలో మునిగి కుళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోనే కాక తెలంగాణలోనూ తుఫాను నష్టం ఎక్కువగానే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి, మొక్కజొన్న, పెసరు, అల్లం, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.
కామారెడ్డి జిల్లాలోనూ గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. 1500 వందల ఎకరాల్లో సోయాబీన్, 700 ఎకరాల్లో మినుప, 800 ఎకరాల్లో పెసర పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 6వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ రైతుల గుండెల్లో గులాబ్ తుఫాన్ కల్లోలం రేపింది. వేలాది ఎకరాల్లో వరి కుళ్లిపోయింది. మానేరు డ్యామ్ ఆయుకట్టు మొత్తం నీట మునగడంతో అపార నష్టం జరిగింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి, ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో పంటలు నీటి మునిగాయి. చేతికొచ్చిన సోయా పంట వరదపాలు కావడంతో అన్నదాతలు అతలాకుతలమయ్యారు.