Telangana Election: నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు.. పరస్పరం రాజకీయ సవాళ్లతో సై అంటే సై అంటున్న నేతలు

| Edited By: Balaraju Goud

Nov 12, 2023 | 11:28 AM

పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీలు వేరైనా.. ప్రత్యర్థులు మాత్రం వారే ఉంటున్నారు. దీంతో వారి మధ్య రాజకీయ వైరం మంటలు రేపుతోంది. పరస్పరం రాజకీయ సవాళ్లతో సై అంటే సై అంటున్నారు. ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచినా..ప్రస్తుతం వారి పార్టీలు, గుర్తులు మారిపోయాయి.

Telangana Election: నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు.. పరస్పరం రాజకీయ సవాళ్లతో సై అంటే సై అంటున్న నేతలు
Vemula Veeresham, Chirumarthi Lingaiah
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీలు వేరైనా.. ప్రత్యర్థులు మాత్రం వారే ఉంటున్నారు. దీంతో వారి మధ్య రాజకీయ వైరం మంటలు రేపుతోంది. పరస్పరం రాజకీయ సవాళ్లతో సై అంటే సై అంటున్నారు. ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచినా..ప్రస్తుతం వారి పార్టీలు, గుర్తులు మారిపోయాయి. ఆసక్తికరంగా మారింది. నకిరేకల్ నియోజకవర్గ బిగ్ ఫైట్‌.

ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట నకిరేకల్ నియోజక వర్గంలో ఎన్నికల రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల వీరేశం గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వేముల వీరేశంపై చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చిరుమర్తి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయనపై ఓడిన వేముల వీరేశం కూడా బీఆర్ఎస్‌లోనే కొనసాగారు. బీఆర్ఎస్‌లో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగింది. సిట్టింగులందరికీ గులాబీ అధినేత కేసీఆర్ టికెట్స్ ఇవ్వడంతో చిరుమర్తి లింగయ్యకు బీఆర్ఎస్ టికెట్ దక్కింది. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన వేముల వీరేశం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతుతో కాంగ్రెస్ టికెట్ వేముల వీరేశం సంపాదించారు.

బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ పడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచినా.. ఈ ఎన్నికల్లో మాత్రం వారి పార్టీలు, గుర్తులు మారిపోయాయి. దీంతో ఇద్దరి మధ్య నువ్వా – నేనా అన్నట్లుగా ఎన్నికల సమరం కొనసాగుతోంది. గెలుపు కోసం ఇద్దరు నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. నకిరేకల్‌లో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నకిరేకల్ బరిలో పాత ప్రత్యర్థులుగా నిలిచి ఢీ అంటే ఢీ అంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ వైరం మళ్లీ సవాళ్ల మంటలు రేపుతోంది.

మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు చిరుమర్తి, రెండో పర్యాయం విజయాన్ని సాధించేందుకు వేముల యత్నిస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులు వేముల వీరేశానికి మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు తమ అనుచరుడుగా ఉన్న చిరుమర్తి లింగయ్యపై కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శల దాడి చేస్తున్నారు. ప్రచారంలో నాయకులు, ప్రజా ప్రతినిధుల చేరికలపై దృష్టి పెట్టారు. తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఎవరికి ఎక్కడి నుంచి రూ. కోట్లు వస్తున్నాయో పరస్పర ఆరోపణలతో సభల్లోనే విమర్శించు కుంటున్నారు. వేముల వీరేశం హయాంలో కంటే తన హయాంలోనే నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చిరుమర్తి లింగయ్య అంటున్నారు. హత్య రాజకీయాలకు పాల్పడే వారికి గుణపాఠం చెప్పాలని, అభివృద్ధికి పట్టం కట్టాలని చిరుమర్తి లింగయ్య పిలుపు నిస్తున్నారు.

చిరుమర్తి వేముల మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో నకిరేకల్ రాజకీయం హీటెక్కుతోంది. డబ్బుల కోసం పార్టీ మారిన వ్యక్తిని ఎన్నుకోవద్దని వీరేశం కోరుతున్నారు. చిరుమర్తి లింగయ్య హయాంలో నకిరేకల్ నిర్లక్ష్యానికి గురైందని వేముల విమర్శిస్తున్నారు. ఆరు గ్యారెంటీల పథకాలతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇవ్వాలని జనంలోకి దూసుకుపోతున్నారు విరేశం. వేములకు కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు ఉండటంతో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

మొత్తం మీద నకిరేకల్ నియోజకవర్గం నేతల రాజకీయ వైరం.. పోలింగ్ నాటికి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…