సిద్దిపేట, ఆగస్టు 30: మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్లాస్టిక్, రసాయనాల ద్వారా తయారు చేసిన వస్తువులను నిత్యం మనం ఏదో ఒక పనికి వాడుతుంటాము. దీంతో పర్యావరణం కలుషితమై సకల చరాచర జీవరాశులు వివిధ వ్యాధులబారిన పడుతున్న విషయం విధితమే. ఈ విషయాన్ని గమనించిన మంత్రి హరీష్ రావు ప్లాస్టిక్, రసాయనిక పదార్థాలతో పొంచి ఉన్న ముప్పును ప్రజలకు వివరిస్తూ ప్లాస్టిక్ రసాయనిక పదార్థాల నిషేధానికి సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు.. మంత్రి ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల మహిళలు ప్రకృతి సిద్ధమైన ఆకులు, వివిధ రకాల పువ్వులతో రాఖీలను తయారుచేస్తున్నారు. ఇప్పటివరకు ప్లాస్టిక్ రసాయనిక పదార్థాలతో తయారుచేసిన రాఖీలను చూసాము. ప్లాస్టిక్ రసాయనాలు వాడడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నందున వాటిని నిషేధిస్తూ పూర్తిగా సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన ఆకులు రకరకాల పువ్వులతో తయారు చేసిన రాఖీలను తమ అన్నా తమ్ముళ్లకు కట్టి రాఖీ పండుగను జరుపుకుంటామని మహిళలు తెలిపారు.
సిద్దిపేటలో ఎకో ఫ్రెండ్లీ రాఖీలను తయారు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళలు. ఎకో ఫ్రెండ్లీ రాఖీలు సిద్దిపేటలో ఆకర్షణీయంగా నిలిచి పలువురుని ఆకట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్ తో తయారయ్యే వస్తువులు పర్యావరణం, మానవుల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. మంత్రి హరీశ్ రావు చొరవతో మరొక అడుగు ముందుకు వేసి ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు మహిళలు కృషి చేస్తున్నారు. పర్యావరణహిత రాఖీల తయారీకి సిద్దిపేటకు చెందిన మహిళలు ఆరు రోజుల నుండి శిక్షణ పొంది రాఖీలు తయారు చేస్తుండటం విశేషం.
అనుబంధానికి ప్రతీకగా నిలిచిన రాఖీ పండగకు మామిడి, రావి ఆకులు, పువ్వులతో రాఖీలు తయారు చేయడాన్ని నేర్పిస్తున్నారు. రావి ఆకు, మామిడి ఆకులు, పువ్వులు శుభ సూచకం కావున సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. మహిళలందరికీ ఏకో ఫ్రెండ్లీ రాఖీల తయారీపై శిక్షణ ఇవ్వనున్నామని శిక్షకులు తెలుపగా.. శిక్షణ పొందిన మహిళలందరూ తమ అన్నలకు తమ్ముళ్లకు కుటుంబ సభ్యులకు ఈ రాఖీలే కడుతామని తెలిపారు. అయితే రాఖీ పండుగ ఎప్పుడన్న విషయంపై కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. రాఖీ పౌర్ణమి తిథి ఆగస్టు 30 మార్నింగ్ 10.58కి ప్రారంభమై ఆగస్టు 31 గురువారం మార్నింగ్ 7.05 గంటల వరకు ఉంటుంది. ఈ తిథి సమయంలో ఎప్పుడైనా రాఖీ కట్టొచ్చు. అయితే శుభ ముహూర్తం ఆగస్టు 30 రాత్రి 9.01 నుంచి ఆగస్టు 31 తెల్లవారుజాము 7.01 గంటలలోపు ఉందని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం