భూమి కంపించింది. జనం భయంతో కంపించిపోయారు. ఉమ్మడి పాలమూరుజిల్లాలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏం జరిగిందో అర్థంకాక..ప్రజలు టెన్షన్‌తో వణికిపోయారు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడటంతో బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో రెండు సెకన్లపాటు భూమి కంపించింది.నాగర్‌కర్నూలు, వనపర్తిజిల్లాలోని అచ్చంపేట, లింగాల, అమ్రాబాద్, ఉప్పునూతల మండలాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ వెల్లడించింది. భూ అంతర్భంగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది.
భూ ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ప్రమాదం తప్పిందని తెలిపింది. స్వల్ప ప్రకంపనాల కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని NCS అధికారులు తెలిపారు. అయితే ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పొరల్లో నీరు చేరడం వల్లే…ఈ ప్రకంపనలు వచ్చి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు భూ ప్రకంపనాలతో అచ్చంపేట, ఉప్పునూతల మండలాల్లోని చాలా గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడటం, శబ్దాలు రావడంతో జనం ఏం జరుగుతుందో అర్థంకాక ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు.
నల్లమల్ల అటవీప్రాంతం సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఓ వైపు కృష్ణానది ఉండటం..మరోవైపు దట్టమైన అటవీప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలే కారణమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.