దుర్గం చెరువులోకి మురుగునీటి చేరికకు చెక్.. శాశ్వత పరిష్కారానికి జలమండలి యాక్షన్ ప్లాన్!
హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులోకి మురుగునీరు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసేందుకు జలమండలి, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. చెరువులోని నాలుగు ప్రధాన మార్గాల ద్వారా మురుగు నీరు వస్తున్నట్టు గుర్తించిన అధికారులు.. వాటి మళ్లింపు, శుద్ధి పనులకు శాశ్వత కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చెరువును కాలుష్య రహితంగా మార్చి, దాని సహజ సౌందర్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడటమే లక్ష్యమని తెలిపారు.

నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు జలమండలి, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. మురుగు ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించి, చెరువును కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు శాశ్వత కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం జలమండలి, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
4 మార్గాల ద్వారా చెరువులోకి మురుగు నీరు
జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, జలమండలి సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మండలా సంతోష్ తదితర ఉన్నతాధికారులు చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రధానంగా నాలుగు మార్గాల, మాదాపూర్ ఐ అండ్ డి నాలా , సైలెంట్ వ్యాలీ ఐ అండ్ డి నాలా , విఠల్ రావు నగర్ బాక్స్ నాలా , టీజీఐఐసీ లేఅవుట్ మార్గం ద్వారా చెరువులోకి మురుగునీరు చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు.
పెరిగిన జనాభా.. సరిపోని ఎస్టీపీ సామర్థ్యం
ప్రస్తుతం దుర్గం చెరువు వద్ద ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నప్పటికీ, పరిసర ప్రాంతాల్లో వేగంగా పెరిగిన నివాసాలు, జనాభా ఒత్తిడి వల్ల భారీగా మురుగు ఉత్పత్తి అవుతోందని అధికారులు గమనించారు. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షపు నీటితో కలసి అధిక మొత్తంలో మురుగు చెరువులోకి చేరుతున్న పరిస్థితిని గుర్తించారు. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు చెరువు పరిసరాల భౌగోళిక స్వరూపం , నీటి ప్రవాహ విధానం ఆధారంగా శాస్త్రీయ అధ్యయనం చేపట్టనున్నారు.
గుర్తించిన నాలుగు ప్రధాన ఇన్‌లెట్ల వద్ద మురుగునీటి మళ్లింపు, శుద్ధి పనులను సమగ్రంగా చేపట్టేందుకు పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. చెరువు సహజ సౌందర్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడటమే లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని జేఎండీ మయాంక్ మిట్టల్ అధికారులను ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
